Rural Development: మ్యాజిక్ డ్రెయిన్ ఆలోచన అద్భుతం
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:27 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం అమలు తీరు చాలా బాగుందని, ఇక్కడ కొత్తగా అమలు చేస్తున్న మ్యాజిక్ డ్రెయిన్‌ల ఆలోచన అద్భుతమని ఛత్తీస్‌గఢ్ అధికారుల బృందం ప్రశంసించింది.
దేశమంతా అమలు చేస్తే పారిశుధ్యం మెరుగు
రాష్ట్ర పర్యటనలో ఛత్తీస్‌గఢ్ అధికారులు
ఏపీ ‘ఉపాధి’ నుంచి చాలా నేర్చుకున్నామని వెల్లడి
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం అమలు తీరు చాలా బాగుందని, ఇక్కడ కొత్తగా అమలు చేస్తున్న మ్యాజిక్ డ్రెయిన్‌ల ఆలోచన అద్భుతమని ఛత్తీస్‌గఢ్ అధికారుల బృందం ప్రశంసించింది. ఈ బృందంలోని 19 మంది అధికారులు రెండు రోజుల పాటు అన్నమయ్య జిల్లాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో పర్యటించి ఉపాధి పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. శుక్రవారం తాడేపల్లి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజను కలిసి పర్యటన అనుభవాలను వివరించారు. అనంతరం కమిషనర్ కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ రామ్‌ధన్ శ్రీవాస్ మాట్లాడుతూ రెండు రోజుల ఏపీ పర్యటన తమకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించిందన్నారు. సాంకేతిక అంశాలను నేర్చుకున్నామని, క్లార్ట్ యాప్ అమలు తీరుతెన్నులను పరిశీలించామని, క్షేత్రస్థాయి సిబ్బందితో భేటీ అయి అనేక విషయాలు తెలుసుకున్నామని తెలిపారు.
వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధి పథకం అమల్లో ఆదర్శంగా ఉందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మస్తిష్కం నుంచి వచ్చిన మ్యాజిక్ డ్రెయిన్ ఒక అద్భుతమని, దానిని దేశమంతా అమలుపరిస్తే గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. బృందంలోని మరో సభ్యుడు మనీశ్‌కుమార్ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ లోని గిరిజన ప్రాంతాల్లో పండ్ల తోట పెంపకం, రీచార్జ్ నిర్మాణాలు చేపడతామని, ఈ పనులు చేపట్టడంలో సాంకేతిక సహకారమివ్వాలని కోరారు. ఏపీ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్ వివిధ విభాగాల గురించి వివరిస్తూ మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 25 వేల పశువుల షెడ్ల నిర్మాణం పూర్తి చేశామని, పశువుల దాహార్తిని తీర్చేందుకు 15 వేల నీటి తొట్టెలను నిర్మించామని తెలిపారు. పనులపై నిఘా కోసం ప్రత్యేకంగా విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్, సామాజిక తనిఖీ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ సునీత, మెంబర్ సెక్రటరీ మద్దిలేటి.. ఉపాధి పథకంలో వివిధ విభాగాల గురించి వివరించారు.