MP CM Mohan Yadav: మార్గదర్శకుడు వాజపేయి
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:37 AM
భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజపేయి అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
వాజపేయి-చంద్రబాబు నేతృత్వంలో దేశాభివృద్ధి
మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ ప్రశంస
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సుపరిపాలన యాత్ర
ధర్మవరం, డిసెంబరు 11(ఆంధ్రజోతి): భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజపేయి అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. నేటి యువతకు ఆయన మార్గదర్శకుడని కొనియాడారు. ప్రధాని మోదీ సుపరిపాలనతో అన్ని దేశాలు భారత్‌వైపే చూస్తున్నాయని చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ‘అటల్.. మోదీ సుపరిపాలన యాత్ర’ను గురువారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు కాలేజీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోహన్ యాదవ్ ప్రసంగించారు. ‘‘వాజపేయి ప్రధానమంత్రిగా దేశాభివృద్ధికి పాటుపడి, ప్రజల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు. వాజపేయి, చంద్రబాబు మధ్య మంచి స్నేహబంధం ఉండేది. వారిద్దరూ అన్ని పార్టీలతో సయన్వయం చేసుకుని దేశాభివృద్ధికి పాటుపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అంటేనే అభివృద్ధి. దేశాభివృద్ధిలో ఏపీది ప్రధాన భూమిక. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఐటీ, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ కల్పనలో పరుగులు పెడుతోంది. ఇందుకు మోదీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏపీ, మధ్యప్రదేశ్ అభివృద్ధిలో దేశానికి మోడల్‌గా ఉంటారు’’ అని పేర్కొన్నారు. రైతులకు క్రెడిట్ కార్డులను అందించడం ద్వారా దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగేలా చేసింది వాజపేయి అని మాధవ్ అన్నారు. పనికి ఆహార పథకం పనిదినాలను పెంచారని, సెల్‌ఫోన్, టెలీఫోన్ విప్లవాన్ని తీసుకువచ్చారని, ప్రతి ఇంటికీ గ్యాస్‌కనెక్షన్ అందించారని చెప్పారు. సుపరిపాలన బస్సు యాత్ర జిల్లాల్లో నిర్వహించి, ఈనెల 25న అమరావతిలో వాజపేయి శత జయంతి సందర్భంగా బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.
వాజపేయితోనే కనెక్టివిటీ విప్లవం: సత్యకుమార్
దేశంలో మొట్టమొదట కనెక్టివిటీ విప్లవాన్ని తీసుకువచ్చిన నాయకుడు వాజపేయి అని మంత్రి సత్యకుమార్ అన్నారు. దేశంలోగ్రామీణ రోడ్లను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ, రూ. 60 వేల కోట్లతో 8 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించారని తెలపారు. స్వర్ణ చతుర్భుజితో జాతీయ రహదారులు నిర్మించారని చెప్పారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో తొలి విగ్రహాన్ని ధర్మవరంలో ఆవిష్కరించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పల్లె సింధూరా రెడ్డి, ఎంఎస్ రాజు, 3 పార్టీల నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్‌రెడ్డి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.