తప్పుచేసి..!
ABN , Publish Date - Jul 02 , 2025 | 01:27 AM
తను చేసిన తప్పులతో ఏఈలు బిల్లులు చేసేందుకు తిరస్కరించటంతో మండల పరిషత సర్వసభ్య సమావేశంలో పెట్రోల్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించిన గుర్విందపల్లి సర్పంచ్ ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్ ఉదంతం సంచలనంగా మారింది. సొంత వైసీపీ ప్రభుత్వంలో చేసిన వర్కులకు బిల్లులు చేయించుకోలేని సర్పంచ్ తాజాగా బిల్లుల కోసం పెట్రోల్‌తో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగటంలో రాజకీయ కోణం ఉందని విమర్శలు వస్తున్నాయి. సర్పంచ్ చేసిన తప్పులు అతనికే శాపంగా మారాయని అధికారులు పేర్కొంటున్నారు.
-అభివృద్ధి పనుల్లో నిబంధనలు ఉల్లంఘించిన గుర్విందపల్లి సర్పంచ్
- బిల్లులు చేయలేనని చేతులెత్తేసిన పూర్వపు ఏఈ
- ఈ బురద నాకేందుకని తిరస్కరించిన ప్రస్తుత ఏఈ
- దీంతో పెట్రోల్ డ్రామాతో రక్తి కట్టించిన సర్పంచ్ ఉదయభాస్కర్
- మూడు నెలల్లో ఆత్మహత్య చేసుకుంటానని మరోసారి వెల్లడి
తను చేసిన తప్పులతో ఏఈలు బిల్లులు చేసేందుకు తిరస్కరించటంతో మండల పరిషత సర్వసభ్య సమావేశంలో పెట్రోల్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించిన గుర్విందపల్లి సర్పంచ్ ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్ ఉదంతం సంచలనంగా మారింది. సొంత వైసీపీ ప్రభుత్వంలో చేసిన వర్కులకు బిల్లులు చేయించుకోలేని సర్పంచ్ తాజాగా బిల్లుల కోసం పెట్రోల్‌తో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగటంలో రాజకీయ కోణం ఉందని విమర్శలు వస్తున్నాయి. సర్పంచ్ చేసిన తప్పులు అతనికే శాపంగా మారాయని అధికారులు పేర్కొంటున్నారు.
తోట్లవల్లూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
గుర్విందపల్లి పంచాయతీ నూతన కార్యాలయానికి 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం రూ.13.50 లక్షలు ఉపాధి హామీ నిధులను కేటాయించింది. పంచాయతీ నిధులు రూ.1.50 లక్షలు కలిపి మొత్తం రూ.15 లక్షల వ్యయం అంచనాతో 2017 నవంబరు 6న అప్పటి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ బాసంశెట్టి రాజశ్రీ పేరున వర్క్ ఆర్డర్ ఉండగా, ఐలూరుకు చెందిన కాంట్రాక్టర్ రాఘవరావు పంచాయితీ భవన నిర్మాణం పిల్లర్లు, ఆపై శ్లాబు వరకు నిర్మించారు. రూ.8 లక్షల వరకు అప్పటికి బిల్లులయినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణాన్ని చాలా కాలం అలాగే వదిలేసింది. భవనం అసంపూర్తిగా ఉండటంతో ప్రస్తుత సర్పంచ్ ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్ అభ్యర్థన మేరకు మండల పరిషత కార్యాలయం నుంచి రూ.2 లక్షల చొప్పున రెండు విడతలుగా రూ.4 లక్షలు ఇవ్వటంతో రాజు అనే కాంట్రాక్టర్ వర్కు పూర్తి చేశారు. దాంతో 2024 మార్చి 11వ తేదీన నాటి ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి వరకు నిధుల చెలింపుల్లో ఎలాంటి సమస్య రాలేదు. తర్వాత పంచాయతీ భవనంలో మిగిలిన వర్కులు పూర్తి చేయాలని కోరటంతో మండల పరిషత నుంచి 2024 జూలైలో రూ.3 లక్షలు కేటాయించారు. ఈ మూడు లక్షలతో ఏయే పనులు చేయాలో పీఆర్ ఏఈతో అంచనా వేసి పంచాయతీలో తీర్మానం చేసి టెక్నికల్ ఆర్డర్ పొందాల్సి ఉంది. ఇవేమి చేయకుండా పనులు చేశాను, బిల్లుల చేయమని పూర్వపు పీఆర్ ఏఈ రాజులపాటి రాఘవరావుని సర్పంచ్ కోరటంతో టెక్నికల్ శాంక్షన్ లేకుండా చేసిన పనులను తానెలా గుర్తిస్తానని, బిల్లులు చేయలేనని తేల్చి చెప్పారు. ఇక్కడే తిరకాసు కనిపిస్తోంది. 2024 మార్చిలో పంచాయతీ భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించాక జూలైలో మళ్లీ రూ.3 లక్షలతో ఇంజనీరింగ్ విభాగానికి తెలపకుండా పనులు చేయటంలోనే డొల్లతనం కనిపిస్తోంది. రాఘవరావు బదిలీ అయి కొత్తగా వచ్చిన పీఆర్ ఏఈ శరాబంధిరాజును ఆ రూ.3 లక్షలకు బిల్లులు చేయమంటే పాత ఏఈ చేయలేని బిల్లులను తానూ చేయలేనని తిరస్కరించారు.
ఏకపక్షంగా పనులు చేసి.. బెదిరింపులు
ఆర్‌అండ్‌బీ రోడ్డు వద్ద పంచాయతీ నిధులతో బస్‌షెల్టర్ నిర్మాణం చేయాలని సర్పంచ్ ఉదయభాస్కర్ చెప్పటంతో ఏఈ శరాబంధిరాజు రూ.2.50 లక్షలకు ఎస్టిమేట్ వేశారు. దీనికి కూడా పంచాయతీ తీర్మానం, టెక్నికల్ శాంక్షన్ రాకుండానే ఏకపక్షంగా పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. బస్‌షెల్టర్‌కు బిల్లులు చేయనని ఏఈ చెప్పారు. దీంతో సర్పంచ్ ఉదయభాస్కర్ బిల్లులకు పరిష్కార మార్గంగా మండల పరిషత సర్వసభ్య సమావేశాన్ని ఎంచుకుని వెంట పెట్రోల్ బాటిల్ తెచ్చి బిల్లులు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఏఈ శరాబంధిరాజును బెదిరించి కలకలం సృష్టించారు. ఇందులో సర్పంచ్ ఉదయభాస్కర్ నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టం అవుతోంది. తన తప్పుని తానే బహిర్గతం చేసుకుని ఇప్పుడు బిల్లులు చేయించుకోలేని పరిస్థితిని కొనితెచ్చుకున్నాడని పలువురు నాయకులు అంటున్నారు.
నన్ను బ్లాక్ మెయిల్ చేయటమే : ఏఈ
పీఆర్ ఏఈ శరాబంధిరాజును వివరణ కోరగా గుర్విందపల్లి సర్పంచ్ ఉదయభాస్కర్ పెట్రోల్ బాటిల్ తెచ్చి బిల్లుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేయటమేనన్నారు. పంచాయతీకి రూ.3 లక్షలు ఖర్చుపెట్టి చేశానని చెబుతున్న వర్కులను తాను చూడలేదని, చూడని వాటికి బిల్లులను చేయలేనని చెప్పారు. బస్‌షెల్టర్‌కు ఎస్టిమేట్ వేసిస్తే టెక్నికల్ శాంక్షన్ తేకుండా నిర్మాణం పూర్తిచేశాక టెక్నికల్ శాంక్షన్ తెచ్చారని, నిర్మాణానికి ఏ మెటీరియల్ ఉపయోగించారో ఎలా అంచనా వేయగలమని ఏఈ తెలిపారు.
90 శాతం తప్పు నాదే
- ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్, సర్పంచ్
సర్పంచ్ ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్ మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో 90 శాతం తప్పు తనదేనన్నారు. అయితే తన సొంత డబ్బులు రూ.8 లక్షల వరకు ఖర్చు చేశానని, వాటికి రూ.4 లక్షల వరకు వడ్డీలు అయ్యాయని, ఈ అప్పులను భరించలేకున్నానని తెలిపారు. బాకీల వారు వచ్చి డబ్బులు అడుగుతుంటే అవమానం తట్టుకోలేకుండా ఉన్నానని, ఏఈ బిల్లులు చేయకుంటే మరణమే శరణ్యమని మరోసారి స్పష్టం చేశారు. మండల సమావేశంలోకి పెట్రోల్ తెవటం తప్పేనన్నారు.