Thief Prabhakar Rao: 33 కోట్లు కొట్టాలి.. గోవాలో సెటిలవ్వాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:47 AM
ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను నెలకొకటి మారుస్తాడు.. నెలకు రూ.2లక్షలు అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన విల్లాలో ఉంటాడు..
పది చోరీల్లోనే రూ.3 కోట్లు దోపిడీ
నెలకో లగ్జరీ కారు.. 2 లక్షల అద్దెతో విల్లా
కోటీశ్వరుడి బిల్డప్.. చేసేది దొంగతనాలు
ఐదు రాష్ట్రాల్లో 90కి పైగా కేసులు
ఇదీ బత్తుల ప్రభాకరరావు నేర చరిత్ర
నేరం ఎలా చేయాలో స్క్రిప్టు రాసుకొని..సీసీ కెమెరాలకు దొరక్కుండా జాగ్రత్త
కోర్టు నుంచి తీసుకెళ్తుండగా పరారీ
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను నెలకొకటి మారుస్తాడు..! నెలకు రూ.2లక్షలు అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన విల్లాలో ఉంటాడు.. కోటీశ్వరుడిలా బిల్డప్ ఇస్తాడు.. కానీ, అతనో దొంగ..! మామూలు దొంగ కాదు.. రూ.3వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్ల వరకూ దోచిన ఘరానా దొంగ..! పేరు బత్తుల ప్రభాకరరావు అలియాస్ బోతా ప్రభాకర్, అలియాస్ రాహుల్ రెడ్డి ఇలా.. రకరకాల పేర్లతో తిరుగుతుంటాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంటకు చెందిన 35 ఏళ్ల ప్రభాకరరావు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉంటున్నాడు. కేవలం పది చోరీల్లోనే రూ.3 కోట్లు కొల్లగొట్టిన ప్రభాకర్.. దోచుకున్న సొమ్మును విలాసాలకు ఖర్చు చేస్తాడు. పలు రాష్ట్రాల్లో అతనిపై సుమారు 90కిపైగా కేసులున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్‌తోపాటు ముగ్గురు నిందితులను ఒక కేసు నిమిత్తం విజయవాడలోని 4వ ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచేందుకు ఐదుగురు పోలీసులు సోమవారం జీపులో తీసుకెళ్లారు. కోర్టు రిమాండు పొడిగించడంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 7.30 గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్దుకూరు శివారులో టిఫిన్ చేసేందుకు ఆగిన సమయంలో... టీ గ్లాసు పడేస్తున్నట్టు నటించిన ప్రభాకర్ ఒక్క ఉదుటున పొలాల్లోకి దూకి పారిపోయాడు.
రోజూ జిమ్ చేసే ప్రభాకర్ రన్నింగ్ బాగా చేస్తాడు. రన్నింగ్‌లో ఉన్న లారీ వెంట పరుగెత్తి అలవోకగా ఎక్కేస్తాడు. దీంతో అతడు దుద్దుకూరు చిట్యాల జాతీయ రహదారిలో ఏదైనా వాహనం ఎక్కి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు. పట్టుకోవడానికి 15 మంది చొప్పున మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ పుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఈ గజదొంగ ఆచూకీ తెలియజేసినా, పట్టుకున్నా రూ.50 వేలు నగదు బహుమతి అందజేస్తామని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మంగళవారం ప్రకటించారు. 2022లో కూడా విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. నిందితుడి చరిత్ర తెలిసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చోరీల ద్వారా రూ.33 కోట్లు సంపాదించి ఆ తర్వాత గోవాలో సెటిలవ్వాలని అనుకున్నాడు. నేరం చేయదలచుకున్న చోటును 1 నుంచి 3 నెలల పాటు పరిశీలిస్తాడు. పక్కా లెక్కలతో దొంగతనం చేస్తాడు.