AP Cabinet Meeting: లులూ.. అతి షరతులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:03 AM
లులూ గ్రూప్‌కు భూకేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది! ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని... రాష్ట్రానికే తన అవసరం ఉన్నదన్నట్లుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది
భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా?
రాష్ట్రానికే తన అవసరమున్నట్లు తీరు
క్యాబినెట్‌లో పవన్ వరుస ప్రశ్నలు
ఆహార శుద్ధి అంటే ఏమిటి?.. గోమాంసం ఎగుమతా?.. లీజు పదేళ్లకు పెంచడమేంటి?
ఉద్యోగులు వాళ్ల వాళ్లేనా? స్థానికులా?
భూములిచ్చేముందే స్పష్టత తీసుకోండి
అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన
అతి షరతులపై చంద్రబాబూ అసహనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
లులూ గ్రూప్‌కు భూకేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది! ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని... రాష్ట్రానికే తన అవసరం ఉన్నదన్నట్లుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది. లులూ ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు. సందేహాలు లేవనెత్తారు. దీనిపై అధికారులతోపాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సీఎం చంద్రబాబు సైతం లులూ గ్రూప్ షరతుల విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రిమండలి సమావేశం అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లులూగ్రూప్‌లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్‌కు 7.48ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో... ఆహారశుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదులిచ్చారు. ‘‘ఆహారశుద్ధి అని ఊరికే అంటే కుదరదు. అక్కడ అసలు ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగుచేస్తారా? ఉద్యానవన పంటలు సాగుచేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా?’’ అని పవన్ సూటిగా ప్రశ్నించారు. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు.
రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టంచేశారు. అక్కడ ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లులూ గ్రూప్ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ ప్రస్తావించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇవే అంశాలను లేవనెత్తారు.
ప్రాతిపదిక ఏమిటి?
లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10 శాతం పెంచాలి కదా అని ప్రశ్నించారు. దీనికి సంబంధిత అధికారులు స్పందిస్తూ.. ‘లులూ యాజమాన్యం పదే పదే కోరడంతోపాటు పెద్ద పరిశ్రమ, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చాం’ అని తెలిపారు. లులూ గ్రూప్ చాలా అతిగా కండీషన్లు పెడుతోందని, ప్రభుత్వానికే తన అవసరం ఉందన్నట్లుగా వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్లు తెలిసింది. విశాఖపట్నం, విజయవాడల్లో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారు? ఇందుకు అనుసరిస్తున్న విధానాలు, మార్గదర్శకాలు ఏమి టి? అని ప్రశ్నించారు. ‘‘లులూ గ్రూప్‌కు ప్రభుత్వం భూము లు ఇచ్చి మాల్స్ ఏర్పాటు చేయమంటోంది. ప్రభుత్వమే భూములు ఇస్తోంది. కానీ... షరతులు ఆ కంపెనీ పెడుతోంది. ఇదెక్కడి చోద్యం? మూడు సంవత్సరాలకోసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్స్‌లో ఉంటోంది. కానీ, ఆ కంపెనీ పదేళ్లకోసారి పెంచాలని కండీషన్ పెడుతోంది? వీటిపై మీరేం చెబుతున్నారు? మాల్స్ నిర్మించాక, ఆ కంపెనీ షాప్‌ల రెంట్ ఎలా పెంచుతుంది? మూడేళ్లకోసారి అద్దెలు పెంచుతారా? లేక పదేళ్లకోసారి పెంచుతామని చెబుతారా? కచ్చితంగా ఏటేటా అద్దె పెంచుకుంటారు కదా! వారికో న్యాయం? ప్రభుత్వానికో న్యాయం! ఇలా ఎక్కడైనా ఉంటుందా? దీనిపై మీరేమంటారు?’’ అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.
ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు?
లులూ ఏర్పాటు చేసే మాల్స్, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంపైనా పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘విశాఖ, విజయవాడలో లులూ గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్‌లో, సంస్థల్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? స్థానికులకు ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? సహజంగా ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నాం. ఇక్కడా అలాగే జరుగుతుందా? అదే జరిగితే ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం? కచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మీరు ఎలాంటి విధానం అనుసరించబోతున్నారు?’’ అని పవన్ సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కచ్చితమైన నిబంధనలు చేర్చుతున్నామని అధికారులు నివేదించారు. లులూ గ్రూప్ కొన్ని అతి షరతులు పెడుతున్న మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘జగన్ ప్రభుత్వం ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమివేసింది. కూటమి ప్రభుత్వం ఆ కంపెనీని తిరిగి ఏపీకి తీసుకురావాలనుకుంటోంది. అయితే... ఆ కంపెనీ అనేక షరతులు విధిస్తోంది. వాటిని పరిశీలిస్తున్నాం. ప్రజలకూ, రాష్ట్రానికీ మేలుచేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని మంత్రి అనగాని బదులిచ్చినట్లు తెలిసింది. లులూ గ్రూప్ షరతుల విషయంలో ముఖ్యమంత్రి కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.