విధేయతకు పట్టం!
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:40 AM
విధేయత, సీనియారిటీ కలబోతే ప్రామాణికంగా ఎన్టీఆర్ జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. పార్టీ జెండాను అంటిపెట్టుకుంటూ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన వారికి సముచిత గుర్తింపును ఇచ్చింది.
- టీడీపీపై విశ్వాసంతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు
- ఎన్టీఆర్ జిల్లాను వరించిన నాలుగు కార్పొరేషన్ పదవులు
- రాష్ట్ర నాగవంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎరుబోతు రమణారావు
- రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌గా పోతిన బాలకోటయ్య
- రాష్ట్ర నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా మరుపిళ్ల తిరుమలరావు
- రాష్ట్ర నూర్‌బాషా, దూదేకుల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నాగుల్ మీరా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విధేయత, సీనియారిటీ కలబోతే ప్రామాణికంగా ఎన్టీఆర్ జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. పార్టీ జెండాను అంటిపెట్టుకుంటూ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన వారికి సముచిత గుర్తింపును ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీనియర్ లీడర్ ఎరుబోతు రమణారావును ఆంద్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా, అమరావతి ఉద్యమంలో బహుజన జేఏసీ తరఫున తన వంతు పాత్ర పోషించిన దళిత సామాజిక వర్గానికి చెందిన పోతిన బాలకోటయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌గా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు నాగుల్ మీరాను ఏపీ నూర్‌బాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్‌గా, మరుపిళ్ల తిరుమలేశ్వరరావును ఏపీ నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించింది.
పార్టీ బలోపేతానికి ఎరుబోతు రమణారావు కృషి
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన ఎరుబోతు రమణారావు నగరంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ప్రజల సమస్యలే అజెండాగా కౌన్సిల్‌లో పోరాటాలు జరిపారు. పార్టీకి విధేయుడిగా ఉన్నారు. నాగవంశ కులానికి చెందిన రమణారావును ఏపీ నాగవంశ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేసి తగిన గుర్తింపును ఇచ్చింది.
అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య క్రియాశీలక పాత్ర
అమరావతి పోరాటంలో నేను సైతం అంటూ బహుజన జేఏసీ తరఫున పోరాటం చేసిన పోతిన బాలకోటయ్య సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది. నందిగామ నియోజకవర్గం కంచికచర్లకు చెందిన బాలకోటయ్య అమరావతి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అమరావతి రాజఽధాని రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం జరిపారు. ఆయనను రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డుకు చైర్మన్‌గా ఎంపిక చేసి తగిన గుర్తింపు ఇచ్చింది.
నగరంలో నగరాలకు ప్రాధాన్యత
నగరంలోని పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నగరాల సామాజికవర్గ ప్రజలు గణనీయంగా ఉన్నారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన స్థానిక సీనియర్ నేత మరుపిళ్ల తిరుమలరావును ఏపీ నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవికి టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో నగరాలకు ప్రాధాన్యత ఇచ్చింది. తిరుమలరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు కొరగంజి శేఖర్‌బాబు రెండో అల్లుడే తిరుమలరావు.
రెండోసారి వరించిన అదృష్టం
పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కె.నాగుల్ మీరాకు రెండో సారి నామినేటెడ్ పదవి వరించింది. ఏపీ నూర్‌బాషా దూదేకుల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా అధిష్టానం నాగుల్ మీరాను ఎంపిక చేసింది. నాగుల్ మీరా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ పార్టీకి సేవలందిస్తున్నారు.