Share News

విధేయతకు పట్టం!

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:20 AM

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలకు అధ్యక్షులుగా ఎవరూ ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయి. ఇవీ అఽధిష్టానం పరిశీలనలో ఉండటం అందరినీ అశ్చర్యపరుస్తోంది. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి పేర్లను పరిశీలించినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా.. చివరి నిమషంలో స్వల్ప మార్పులు జరగకపోతే దాదాపుగా ఇవే పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది.

విధేయతకు పట్టం!

- ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా రథసారథులుగా గద్దె అనూరాధ, వీరంకి గురుమూర్తి!

- అనూహ్యంగా తెరపైకి వీరిద్దరి పేర్లు

- పరిశీలించిన అధిష్టానం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం

- ఉమ్మడి కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా అనూరాధకు గుర్తింపు

- బలహీన వర్గాల నేతగా వీరంకి గురుమూర్తికి మంచి పేరు

-త్వరలో అధికారికంగా వెల్లడికానున్న నియామకాలు

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలకు అధ్యక్షులుగా ఎవరూ ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయి. ఇవీ అఽధిష్టానం పరిశీలనలో ఉండటం అందరినీ అశ్చర్యపరుస్తోంది. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి పేర్లను పరిశీలించినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా.. చివరి నిమషంలో స్వల్ప మార్పులు జరగకపోతే దాదాపుగా ఇవే పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

టీడీపీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కె.నాగుల్‌ మీరా, బొమ్మసాని సుబ్బారావు తదితరుల్లో ఎవరో ఒకరిని నియమించాలని ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు రాష్ట్ర పరిశీలకులకు, అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని తెలియపరిచారు. అధిష్టానం కూడా ఈ ముగ్గురి పేర్లను పరిశీలించిన మీదట ఐవీఆర్‌ఎస్‌ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి అభిప్రాయం తెలుసుకుంది. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి అవకాశం లభిస్తుందని అందరూ భావించగా.. అనూహ్యంగా గద్దె అనూరాధ పేరును అధిష్టానం తెరపైకి తెచ్చింది. కృష్ణాజిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న కొనకళ్ల నారాయణరావు, సీనియర్‌ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ పేర్లను పరిశీలించాల్సిందిగా జిల్లా నాయకులు అధిష్టానానికి సిఫార్సు చేశారు. ఈ పేర్లను పరిశీలించిన మీదట కొనకళ్ల నారాయణరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, కోనేరు నాగేంద్రబాబులకు సంబంధించి అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే జరిపింది. ఈ ముగ్గురిలో ఎవరికో ఛాన్స్‌ దక్కవచ్చని అంతా భావించగా.. అనూహ్యంగా వీరంకి గురుమూర్తి పేరును అధిష్టానం పరిశీలించింది. ఎన్టీఆర్‌ జిల్లాకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె అనూరాధకు, కృష్ణా జిల్లాకు బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వీరంకి గురుమూర్తికి బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

తొలి సారిగా మహిళకు పార్టీ సారథ్య బాధ్యతలు!

టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో మహిళా అధ్యక్షురాలిగా ఎవరూ పనిచేయలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు టీడీపీ అధ్యక్షులుగా అక్కినేని కృష్ణారావు, బండి శ్రీమన్నారాయణ, వల్లభనేని బాబూరావు, సైకం ఆర్జునరావు, అంబటి బ్రాహ్మణయ్య, తొండెపు జనార్దన్‌, కడియాల రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, విజయవాడ అర్బన్‌ అధ్యక్షుడిగా బుద్దా వెంకన్న పనిచేశారు. రెండు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఎన్టీఆర్‌ జిల్లాకు నెట్టెం రఘురామ్‌, కృష్ణాజిల్లాకు కొనకళ్ల నారాయణరావుకు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ అవకాశాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించనున్నారు.

2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..

మాజీ ఎంపీ, ప్రస్తుత విజయవాడ తూర్పు శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌ సతీమణే గద్దె అనూరాధ. 2014లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1959లో జన్మించిన గద్దె అనూరాధ గుడ్లవల్లేరులో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బయో కెమిస్ర్టీలో పీజీ చేశారు. కొంత కాలం లెక్చరర్‌గా పాఠాలు చెప్పిన అనూరాధ, ఆ తర్వాత కెమిస్ట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో గద్దె రామ్మోహన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. కుటుంబ వ్యాపారమైన బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థగా నిలబెట్టారు. గద్దె రామ్మోహన్‌ గన్నవరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సమయంలో తొలిసారిగా తన భర్త తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాడు గద్దె గెలుపులో అనూరాధ కృషి కూడా ఉంది. ఆ తర్వాత గద్దె తిరిగి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో అనూరాధకు అనూహ్యంగా 2014లో జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పార్టీ నిలిపింది. ఈ అవకాశంతో అనూరాధ రాజకీయ అరంగేట్రం చేశారు. పిన్నమనేని కోటేశ్వరరావు, మండలి కృష్ణారావు వంటి మహామహులు పనిచేసిన ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌ పీటం గద్దె అనూరాధ తొలి ప్రయత్నంలో అధిష్టించారు. సమర్థవంతమైన పాలన అందించారు. 2017-18, 2018-19 సంవత్సరాలలో ఉత్తమ జిల్లా పరిషత అవార్డులను సాధించి పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని విధ్వంసానికి పూనుకున్న సందర్భంలో అమరావతి మహిళా రైతులకు ఆమె అండగా నిలబడ్డారు. ఆమె నేతృత్వంలో మెగా ర్యాలీలను నిర్వహించారు. కేసులను కూడా ఎదుర్కొన్నారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టిన సందర్భంలో కూడా 52 రోజుల పాటు జరిగిన నిరసన శిబిరంలో అనూరాధ పాలుపంచుకున్నారు. నారా లోకేశ్‌ తలపెట్టిన యువగళం పాదయాత్రలో కూడా కృష్ణాజిల్లా అంతా ఆమె పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ఆమె పనిచేశారు.

విద్యార్థి నేత నుంచి ఎదిగిన గురుమూర్తి

రాష్ట్ర గౌడ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న వీరంకి గురుమూర్తికి అఽధినేత చంద్రబాబు అద్భుతమైన అవకాశం కల్పించనున్నారు. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు వీరంకి గురుమూర్తి స్వగ్రామం. గౌడ సామాజిక వర్గానికి చెందిన గురుమూర్తి బలహీనవర్గాల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఎదిగారు. 1985 నుంచి 87 వరకు ఉయ్యూరు పట్టణ తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశారు. 1988 నుంచి 1994 వరకు తోట్లవల్లూరు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995 నుంచి 1999 వరకు తోట్లవల్లూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1999 నుంచి 2002 వరకు తోట్లవల్లూరు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చూపారు. అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు టీమ్‌లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. 2007 నుంచి 2016 వరకు ఉమ్మడి కృష్ణాజిల్లా బీసీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పంచాయతీరాజ్‌ అసోసియేషన్‌లో పలు కీలక పదవులు నిర్వహించారు. అధికారంలో ఉండగా.. తోట్లవల్లూరు మండల పరిషత అధ్యక్షుడిగా, నార్త్‌ వల్లూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉండగా.. వీరంకి గురుమూర్తి అనేక కేసులను ఎదుర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 01:20 AM