Hydrogen Valley: తక్కువ ఖర్చుతోనే గ్రీన్ హైడ్రోజన్
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:56 AM
తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరగాలని గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అభిప్రాయపడింది.
ఏపీలో మూడు పరిశోధన క్లస్టర్లు.. ఏపీ అసోసియేషన్ ఏర్పాటవ్వాలి
అమరావతి సమ్మిట్ డిక్లరేషన్
రేపు ప్రభుత్వానికి నివేదన
ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన మరో సంస్థ
గుంటూరు/మంగళగిరి, జూలై 19(ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరగాలని గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అభిప్రాయపడింది. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో రెండు రోజులు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ శనివారం ముగిసింది. రెండో రోజు మేధావులు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి, జాతీయ స్థాయిలో వలే గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్‌ను నెలకొల్పడానికి, హరిత ఉదజని ఉత్పత్తి ఖర్చును సగానికి తగ్గించేందుకు నిరంతరం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు రాష్ట్రంలో కొనసాగించడానికి ఈ సదస్సులో డిక్లరేషన్ రూపొందించారు. ఆ డిక్లరేషన్‌ని సోమవారం ప్రభుత్వానికి నివేదించనున్నారు. సదస్సులో చర్చించిన అంశాలను ఎస్‌ఆర్‌ఎం గ్రూపు సంస్థల రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు వివరించారు. తొలి రోజు సీఎం సమక్షంలో జరిగిన రూ. 51 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో పాటు అమెరికాకు చెందిన సినర్‌జెన్ సీఈవో ప్రణవ్ తాంతి ఆంధ్రప్రదేశ్‌లో మరో 40 వేల టన్నుల సామర్థ్యం గల గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకారం తెలిపారని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చుని రూ. 400 నుంచి రూ. 200కు తగ్గించాలని, వచ్చే రెండు, మూడేళ్లలో హైడ్రోజన్‌తో నడిచే కారు, రైలుని వినియోగంలోకి తీసుకురావాలని డిక్లరేషన్‌లో పొందుపరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొ-వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ సతీష్ కుమార్, నెడ్‌క్యాప్ ఏపీ ఎండీ కమలాకర్‌బాబు, సుజిత్ ఎంఎన్‌ఆర్‌ఈ నుంచి డాక్టర్ సుజిత్ పిళ్లై, మారం పార్థసారథి, సుజిత్ కల్లూరి పాల్గొన్నారు.
అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ
అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటుపై రెండో రోజు డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. రెండు రోజుల సమ్మిట్‌లో ప్రముఖల అభిప్రాయాలు, చర్చకు వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిక్లరేషన్‌ను రూపొందించాం. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆర్ అండ్ డీ ప్రతినిధులు, వివిధ సంస్థలు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు సమ్మిట్‌కు హాజరయ్యారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి, వివిధ పాలసీలపై చర్చించారు. అమరావతికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తే రాజధాని ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది.
-డాక్టర్ పార్థసారథి (సమ్మిట్ కన్వీనర్, ఎస్‌ఆర్‌ఎం)
భవిష్యత్తులో శిలాజ ఇంధనాల కొరత
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న శిలాజ ఇంధనాలు భవిష్యత్తులో దొరక్కపోవచ్చు. ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, టెక్నాలజీ అభివృద్ధి, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. పంట వ్యర్థాలతో స్థిరమైన ఇంధన శక్తిని ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
- డాక్టర్ మల్లికార్జునరావు
(సీఈవో, శక్తి ఫోటాన్ సొల్యూషన్స్)
కార్బన్ రహిత సమాజానికి దోహదం
కార్బన్ రహిత సమాజానికి గ్రీన్ హైడ్రోజన్ ఒక ఆశాజనకమైన మార్గం. గ్లోబల్ వార్మింగ్ విపత్తు నుంచి బయటపడాలంటే హైడ్రోజన్ ఇంధన వనరులను గణనీయంగా ఉత్పత్తి చేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడుకుంది. దాని స్టోరేజీ, ట్రాన్స్‌పోర్టేషన్, వనరుల వినియోగం కూడా ప్రధానం. ఈ అంశాలపై సదస్సులో నిపుణులు చర్చించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. విశాఖపట్నం, కాకినాడలో త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.
- అనిల్‌కుమార్ (ఆర్ అండ్ డీ డీన్,
తిరుపతి ఐఐటీ)