Share News

Low Application Response: బార్‌.. బేర్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:41 AM

దరఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా రాష్ట్ర నూతన బార్‌ విధానానికి స్పందన కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్‌లు ఇవ్వడానికి నోటిఫికేషన్‌ జారీచేస్తే..

Low Application Response: బార్‌.. బేర్‌

  • లైసెన్స్‌ దరఖాస్తులకు స్పందన కరువు

  • 840 బార్లకు వచ్చింది 30 మాత్రమే

  • ఔత్సాహికుల కోసం ‘ఎక్సైజ్‌’ ఎదురుచూపులు

  • రేపటితో ముగుస్తున్న గడువు

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): దరఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా రాష్ట్ర నూతన బార్‌ విధానానికి స్పందన కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్‌లు ఇవ్వడానికి నోటిఫికేషన్‌ జారీచేస్తే.. ఈ వారం రోజుల్లో కేవలం 30 దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తులు సమర్పించేందుకు మంగళవారం చివరి రోజు. మరో రెండ్రోజులే గడువున్నా వ్యాపారుల్లో పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఎక్సైజ్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త పాలసీ విఫలమవుతుందన్న ప్రచారం ఉధృతమైంది. ఆదివారం రాత్రి వరకు కృష్ణా జిల్లాలో 13, కర్నూలు-1, నంద్యాల-1, ఎన్టీఆర్‌-7, పల్నాడు-1, ప్రకాశం-3, తిరుపతి-1, విజయనగరం-1, కడప జిల్లాలో రెండు వచ్చాయి. వీటిలోనూ నాలుగు దరఖాస్తులు వచ్చిన బార్లు రెండే ఉన్నాయి. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీయరు. అంటే లాటరీ తీయదగిన స్థాయిలో దరఖాస్తులు అందింది కేవలం రెండు బార్లకు మాత్రమే. కాగా సుమారు వెయ్యి మంది రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. వారు రూ.5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పిస్తారా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ వారంతా దరఖాస్తులు సమర్పించినా 30 శాతం బార్లే లాటరీలోకి వస్తాయి. 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3,360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్‌కు నాలుగు చొప్పున దరఖాస్తులు అందాలి. ఒకవేళ ఏదైనా బార్‌కు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వేస్తే మొత్తం దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చివరికి సగం బార్లకైనా వస్తాయా అనే అనుమానం కలుగుతోంది. బార్లకు ఇచ్చే మద్యంపై అదనపు పన్ను, నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు.


ఎక్సైజ్‌ అధికారులు ఎంత అనునయించినా ముందుకు రావడం లేదు. మరోవైపు.. ప్రతికూలంగా ఉన్న నిబంధనలను సవరిస్తారని వ్యాపారుల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు దరఖాస్తులు తప్పనిసరి నిబంధనను తొలగిస్తారని, అదనపు పన్ను మినహాయింపు వస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు మాత్రం పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టంచేస్తున్నారు. ఈ మార్పులపై ప్రభుత్వం ఆలోచన కూడా చేయలేదు. దీంతో కొత్త పాలసీ నీరుకారిపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

Updated Date - Aug 25 , 2025 | 05:41 AM