Weather Department: 13న బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:15 AM
ఉత్తర ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడింది.
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఏడో తేదీకల్లా వాయుగుండంగా బలపడి, ఆ తరువాత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 13వ తేదీకల్లా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల ఒడిశా, కోస్తాంధ్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. దీని ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.