IMD Forecast: రేపు అల్పపీడనం
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:16 AM
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
2 రోజుల్లో వాయుగుండంగా బలోపేతం
రాష్ట్రానికి భారీ, అతిభారీ వర్షాలు: ఐఎండీ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్):
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో అది పశ్చిమవాయవ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడనుందని, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే, వాయుగుండం మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందన్నారు. అల్పపీడనం తీరం దిశగా వచ్చే క్రమంలో వర్షాలు పెరగనున్నాయి. దీనికితోడు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరులో 4.9, విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3, పాల్తేరులో 4.1, అల్లూరి జిల్లా కాకరపాడులో 3.9 సెంటీమీటర్ల వాన పడింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సోమ, మంగళవారాలు కొన్నిచోట్ల భారీ వర్షాలు, బుధ, గురు, శుక్రవారాలు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది వ్యవసాయ పంటలపై ప్రభావం చూపుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.