Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:39 AM
శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తమిళనాడు వైపు వెళ్లనుంది.
రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా,సీమకు భారీ వర్షాలు!
కొనసాగుతున్న చలి తీవ్రత
అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం/అమరావతి, న వంబరు 15(ఆంధ్రజ్యోతి): శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తమిళనాడు వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు వీస్తున్నాయి. ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు, 18వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వాయవ్య భారతం నుంచి గాలులు కోస్తా, రాయలసీమ వరకు వీస్తుండడంతో శనివారం చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అరకులోయలోయలో 7, డుంబ్రిగుడలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అల్పపీడనం రాగల 24గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, ఈనెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 24-27 తేదీల మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.