Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:46 AM
ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి....
రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో 11.17, నరసన్నపేటలో 10.42, శ్రీకాకుళంలో 9, ఆమదాలవలసలో 8.28, పాత కొప్పెర్లలో 7.7, భీమిలిలో 6.5, సాలవువానిపాలెంలో 6, శ్రీకాకుళంలో 5.8, నాతయ్యపాలెంలో 5.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలోని 65 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. బుధవారం ఉత్తరకోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.