Heavy Rains: 13న అల్పపీడనం
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:26 AM
ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అనిశ్చితి నెలకొనడం, సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావడంతో నైరుతి రుతుపవనాలు మోస్తరుగా కదులుతున్నాయి.
కోస్తాకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, అనంతపురం అర్బన్, విజయవాడ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అనిశ్చితి నెలకొనడం, సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావడంతో నైరుతి రుతుపవనాలు మోస్తరుగా కదులుతున్నాయి. దీంతో శనివారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల కురిసిన వర్షాలు ఆదివారం కూడా కొనసాగాయి. ఉదయం నుంచి పిడుగులు, ఈదురుగాలులతో రాయలసీమ, కోస్తాలో వర్షాలు కురిశాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడంతో వాతావరణం చల్లబడింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. అదే రోజు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దీని ప్రభావంతో 13న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. 12, 13 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా, 14, 15 తేదీల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 16వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద
ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద పెరుగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్‌కు 67,346 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో బ్యారేజ్ 60 గేట్లను అడుగు మేరకు ఎత్తి 43,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి 51,207 క్యూసెక్కులు, పాలేరు నుంచి 1,413, కీసర నుంచి 14,726 క్యూసెక్కుల వరద వస్తోంది. దీని నుంచి కృష్ణా తూర్పు డెల్టా పరిధిలోని కాల్వలకు 10,042 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ డెల్టాకు 6,908, గుంటూరు కెనాల్‌కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం నాటికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరుతుందని సీడబ్ల్యూసీ ఫోర్‌కాస్ట్ విడుదల చేసింది.
అనంతలో భారీ వర్షం..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి జోరు వాన కురిసింది. తాడిపత్రి మండలంలోని బుగ్గ సమీపాన తాడిపత్రి-నంద్యాల రోడ్డు తెగిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. అధికారులు మరమ్మతులు చేపట్టి 4 గంటల తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు. తాడిపత్రి మండలంలోని ఆవులతిప్పాయపల్లి సమీపాన వంకలో జీపు కొట్టుకుపోయింది. డ్రైవర్ ఒడ్డుకు చేరుకుని, ప్రాణాలు కాపాడుకున్నారు. అదే మండలంలోని ఆలూరు కోన రంగనాథస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొండచరియలు విరగిపడడంతో ఆ బురదమట్టిలో వాహనాలు కూరుకుపోయాయి.