Heavy Rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:32 AM
ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని...
24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే చాన్స్
ఏలూరు జిల్లాలో ఉప్పొంగిన తమ్మిలేరు, ఎర్రకాల్వ
విశాఖపట్నం/అమరావతి/ఏలూరు, సెప్టెంబరు2 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత ఉత్తర ఒడిశాలో తీరం దాటి పశ్చిమ వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 9.3, వజ్రపుకొత్తూరులో 8.1, చినబాడాంలో 7.9, పలాసలో 7, రావివలసలో 5.6, హరిపురంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబటి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఏలూరు జిల్లాలో తమ్మిలేరు, ఎర్రకాల్వలకు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం నాగిరెడ్డిగూడెం డ్యామ్ నుంచి 2,700 క్యూసెక్కులను తమ్మిలేరు మీదుగా విడుదల చేశారు. సోమవారం ఏడువేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో ఏలూరు-శనివార పుపేట కాజ్‌వే పై 2 మీటర్ల మేర నీరు ప్రవహించగా రాకపోకల ను అధికారులు నిలిపివేశారు. జంగారెడ్డిగూడెం మండలం సరిహద్దులో ఎర్రకాల్వ ఉధృతి పెరిగే ప్రాంతంలో రెవెన్యూ, పోలీసులు గస్తీ కాస్తున్నారు.
ప్రాజెక్టుల్లో స్థిరంగా జలాలు..
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్‌లో గరిష్ఠ నీటి మట్టం 312.05 టీఎంసీలు కాగా మంగళవారం నాటికి 299.74 టీఎంసీలకు తగ్గింది. మొత్తంగా జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.