ఎదురుచూపు!
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:11 AM
గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన నీరు-చెట్టు పథకం పనుల బిల్లుల కోసం నందివాడ 9వ నంబర్ డిస్ర్టిబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన రూ.8.68 లక్షలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తే, బిల్లులు వెంటనే చెల్లించాలని 2022లో ఆదేశాలు ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- 2018-19లో నీరు-చెట్టు పథకం కింద పనులు
- రూ.8.68 లక్షలకు నిలిచిపోయిన బిల్లుల చెల్లింపు
- హైకోర్టును ఆశ్రయించిన నందివాడ 9వ నంబర్ డిస్ర్టిబ్యూటరీ కమిటీ
- బిల్లులు వెంటనే చెల్లించాలని 2022లో కోర్టు ఆదేశం
- నేటి వరకు పట్టించుకోని అధికారులు
గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన నీరు-చెట్టు పథకం పనుల బిల్లుల కోసం నందివాడ 9వ నంబర్ డిస్ర్టిబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన రూ.8.68 లక్షలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తే, బిల్లులు వెంటనే చెల్లించాలని 2022లో ఆదేశాలు ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి - గుడివాడ:
గత టీడీపీ ప్రభుత్వంలో 2018-19 మధ్య గుడివాడ డివిజన్‌లో నీరు-చెట్టు పథకం కింద రూ.8.68 లక్షల పనులను అప్పటి నందివాడ డీసీ-9 అధ్యక్షులు బొర్రా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు యలమంచిలి సతీష్ చేపట్టారు. నందివాడ నుంచి రామాపురం వరకు జంగిల్ క్లియరెన్స్, దోసపాడు కాలువలో సరుగుడు బాదులు, తడికలు, మట్టిసంచులు పెట్టడం వంటి పనులను చేశారు. వీటికి సంబంధించి బిల్లులు ఇచ్చే సమయంలో ఎన్నికలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి రాగానే నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులను నిలుపుదల చేసింది. 2022లో నీరు-చెట్టు పథకం కింద పనులు చేపట్టిన నీటి సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు వెంటనే బిల్లులను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2022లో నీటి సంఘాల పాలకవర్గం గడువు ముగిసింది. ఆనాటి నుంచి జలవనరుల శాఖ అఽధికారుల చుట్టూ నీటి సంఘాల మాజీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు తిరుగుతూనే ఉన్నారు.
బ్యాంకు ఖాతాలో నగదు ఉన్నా చెల్లింపులు నిల్
కోర్టు తీర్పుతో రెండు పర్యాయాలుగా డీసీ-9కు చెందిన యాక్సిస్ బ్యాంకు ఖాతాలో నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కోర్టు తీర్పుకు తలొగ్గి అప్పటి వైసీపీ ప్రభుత్వం మొదటి పర్యాయం 2023, ఆగస్టు 28వ తేదీన రూ.94,925, 2024, ఫిబ్రవరి 23వ తేదీన రెండో పర్యాయం రూ.7,73,764 జమ చేసింది. అయితే రెండేళ్లుగా అధికారులు ఈ ఖాతాలోని నగదు తీసి ఇవ్వడానికి ముందుకు రావడంలేదు.
నిర్లక్ష్యంగా అధికారులు
పాత పాలకవర్గం గడువు ముగియడంతో బ్యాంకు ఖాతాల తాలుకు చెక్కులను జలవనరుల శాఖ అధికారులకు అప్పగించారు. మూడేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. కొత్త పాలకవర్గం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా వారి పేరున బ్యాంకు ఖాతాలను తెరిచిన దాఖలాలు లేవు. ఒకే నీటి సంఘం పేరు మీద రెండు బ్యాంకు ఖాతాలు ఉండటం కుదరదు. తప్పనిసరిగా పాత ఖాతాలను మూసివేయాల్సిఉంది. ఈ క్రమంలో బ్యాంకులో జమ అయిన నగదును జలవనరుల శాఖ అఽధికారులు సంబంధిత నీటి సంఘాలకు చెక్కు రూపేణ చెల్లించాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక ఏడాది, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న నగదు చెల్లింపులకు జలవనరుల శాఖ అధికారులు ముందుకు రావడం లేదు.
అప్పులు చేసి మరీ పనులు చేపట్టాం
- బొర్రా సత్యనారాయణ, యలమంచిలి సతీష్, డీసీ-9 మాజీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు
2018-19 కాలంలో నీరు-చెట్టు పథకం కింద రూ.8,68,689 పనులు చేశాం. వీటికి సంబంధించిన బిల్లులు గత వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా మంజూరు కాలేదు. కోర్టు ఆదేశాలను కూడా అధికారులు లెక్క చేయడంలేదు. అప్పులు చేసి మరీ పనులు చేపట్టాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించి మాకు న్యాయం చేయలి.