చల్లగా చూడమ్మా.. మహాచండికా..
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:15 AM
ప్రత్యేక పూజలు, హోమాలు, నగరోత్సవం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఇంద్రకీలాద్రి దేదీప్య మానంగా వెలిగిపోతోంది. భక్తుల జయ జయధ్వానాలకు తన్మయత్వం చెందుతోంది. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా ఉద్భవించిన మహాచండీగా కనకదుర్గమ్మ ఆదివారం దర్శనమిచ్చారు. అనేక మంది దేవతలు కొలువై ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశించారు. విద్య, కీర్తి, సంపదలను ప్రసాదించే తల్లీ.. చల్లగా చూడమ్మా అంటూ మనసారా చండికాదేవిని వేడుకున్నారు.
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
మహాచండీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
నిమిషానికి 100 మంది భక్తులకు దర్శనం
ఆదివారం అర్ధరాత్రి భారీగా వస్తున్న భక్తులు
ప్రత్యేక పూజలు, హోమాలు, నగరోత్సవం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఇంద్రకీలాద్రి దేదీప్య మానంగా వెలిగిపోతోంది. భక్తుల జయ జయధ్వానాలకు తన్మయత్వం చెందుతోంది. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా ఉద్భవించిన మహాచండీగా కనకదుర్గమ్మ ఆదివారం దర్శనమిచ్చారు. అనేక మంది దేవతలు కొలువై ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశించారు. విద్య, కీర్తి, సంపదలను ప్రసాదించే తల్లీ.. చల్లగా చూడమ్మా అంటూ మనసారా చండికాదేవిని వేడుకున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ): ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కనకదుర్గమ్మ ఆదివారం మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాషా్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు క్యూల్లోకి చేరుకున్నారు. పోలీసులు, దేవస్థాన అధికారులు గడచిన ఏడాది ఉత్పన్నమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తిరుమల తరహా కంపార్టుమెంట్ల విధానాన్ని అమలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తే వారిని నియంత్రించడానికి వీఎంసీ ఎదురుగా, వీఎంసీ వెనుక వైపున తాత్కాలికంగా కంపార్టుమెంట్లను ఏర్పాటు చేయించారు. ప్రతి కంపార్టుమెంట్‌కు చుట్టుపక్కల బారికేడ్లు ఏర్పాటు చేశారు. వినాయకుడి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రిపై వరకు 1.08 కిలోమీటర్లు ఉన్న క్యూలైన్లు నిండిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఈ కంపార్టుమెంట్లలోకి పంపారు. భక్తులను కూర్చోబెట్టడానికి మొత్తం 30 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులను వచ్చినట్టుగా కంపార్టుమెంట్లలోకి పంపారు. క్యూలైన్లు ఖాళీ అవుతుండగా ఒక్కో కంపార్టుమెంట్ నుంచి భక్తులను క్యూలైన్లలోకి పంపారు. ఆదివారం నిమిషానికి 100 మంది భక్తులకు దర్శనం పూర్తయిందని అధికారులు తెలిపారు. మఽధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తులతో కనిపించిన కంపార్టుమెంట్లు మూడు గంటలకు ఖాళీ అయ్యాయి. ఆ సమయానికి ఒక కంపార్టుమెంట్‌లో మాత్రమే భక్తులు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన భక్తులు నేరుగా క్యూలైన్లలోకి చేరుకున్నారు. రాత్రి ఏడు గంటల సమయానికి 1,01,400 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 34,339 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు దర్శన సమయం 2.14 గంటలు పట్టింది. 3,829 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2,37,607 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. దర్శనానికి వచ్చి తప్పిపోయిన నలుగురు చిన్నారులను చైల్డ్ ట్రేసింగ్ ట్యాగ్ ద్వారా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కనకదుర్గమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రం మూల రోజున ఈ అలంకారంలో కనిపిస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.