Share News

Nara Lokesh: ఏడుగురు ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయలేరా

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:28 AM

క్యాబినెట్‌ భేటీకి ముందు ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రి లోకేశ్‌ ఏర్పాటు చేసిన బ్రేక్‌ ఫాస్ట్‌ భేటీలోనూ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై చర్చ జరిగింది.

Nara Lokesh: ఏడుగురు ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయలేరా

  • సానుకూలతలన్నిటినీ వెనక్కి నెట్టేలా మన ఎమ్మెల్యేల వివాదాలపై చర్చ

  • ఇది చాలా ప్రమాదకర సంకేతం.. క్యాబినెట్‌ భేటీకి ముందు మంత్రులతో లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): క్యాబినెట్‌ భేటీకి ముందు ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రి లోకేశ్‌ ఏర్పాటు చేసిన బ్రేక్‌ ఫాస్ట్‌ భేటీలోనూ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై చర్చ జరిగింది. ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయలేకపోతే ఎలాగని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై సీఎం చాలా సీరియ్‌సగా ఉన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఇన్‌చార్జి మంత్రులపైనే ఉంది. స్త్రీశక్తి పథకానికి ఆడపడుచుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. తల్లికి వందనంపై కూడా పాజిటివ్‌ రిపోర్టులు ఉన్నాయి. అన్నదాత సుఖీభవపై రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. పులివెందులలో కూడా టీడీపీ గెలిచిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. ఈ సానుకూలతలన్నిటినీ వెనక్కినెట్టేసేలా రాష్ట్రమంతా మన ఎమ్మెల్యేల వివాదాలపైనే చర్చ జరుగుతుండడం చాలా ప్రమాదకర సంకేతం. వారు చేసే పనులకు పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరిస్తాం’ అని లోకేశ్‌ తేల్చిచెప్పారు. శ్రీశైలం ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం చేస్తున్న మంచి అంతా పోయి చివరకు ప్రజల్లో వ్యతిరేక భావన ప్రబలే ప్రమాదం ఉంది’ అని వ్యాఖ్యానించారు.


ఆ ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తూ సీరియస్‌

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ పేర్లను ప్రస్తావిస్తూ లోకేశ్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యేల వివాదాల్లో తప్పు ఎవరిదైనా చివరకు ప్రభుత్వంపై ప్రభావం పడిందని, ఇలాంటి విషయాల్లో ఎమ్మెల్యేలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే పనులు ఎవ్వరూ చేయొద్దని.. ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలోని ఏడుగు ఎమ్మెల్యేలకు గట్టిగా హెచ్చరికలు పంపాలని సూచించారు.

బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ తప్పనిసరి..

నెల్లూరు లేడీ డాన్‌, ఆమె ప్రియుడికి పెరోల్‌ అంశాన్ని లోకేశ్‌ హోం మంత్రి అనితతో ప్రస్తావించారు. ‘ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఎవరు సిఫారసు చేసినా బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ తప్పక జరగాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో అనవసర వివాదాలు తప్పవు’ అని అన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 07:33 AM