US Visit: 6న డాల్‌సలో లోకేశ్ పర్యటన
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:02 AM
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ డిసెంబరు 6న అమెరికాలోని డాల్‌సలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు సంఘీభావంగా నిలబడడమే గాక..
గార్లాండ్‌లో భారీ సభ.. 8 వేల మంది హాజరవుతారని అంచనా
8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
ఏపీఎన్నార్టీ చైర్మన్ రవికుమార్ వెల్లడి
(డాలస్ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ డిసెంబరు 6న అమెరికాలోని డాల్‌సలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు సంఘీభావంగా నిలబడడమే గాక.. గత ఏడాది ఎన్నికల్లో కూటమి విజయానికి శ్రమించిన ప్రవాసాంధ్రులను కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు.. ఇదే సమయంలో రాష్ర్టాభివృద్థికి వారి నుంచి మరింత చేయూతను అభ్యర్థించే నిమిత్తం ఆయన పర్యటించనున్నట్లు ఈ కార్యక్రమం సమన్వయకర్త, ఏపీఎన్నార్టీ చైర్మన్ వేమూరు రవికుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎన్నారై టీడీపీ-బీజేపీ-జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆరో తేదీన డాలస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో జరిగే భారీ సభలో ప్రవాసులను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తారని చెప్పారు. అమెరికా, కెనడాల నుంచి 8 వేల మంది ప్రవాసులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల వర్తకం సుమారు రూ.17.92 లక్షల కోట్లు ఉండగా.. దిగుమతులు రూ.11.65 లక్ష కోట్లకు చేరాయని, దీనిని మరింత విస్తరించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసేందుకు తన అమెరికా పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని లోకేశ్ లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించారు. డాలస్ పర్యటన అనంతరం 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారని చెప్పారు.