Lokesh Urges Students: మార్పు విద్యార్థులతోనే సాధ్యం
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:46 AM
విద్యార్థులు భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, సమాజంలో మార్పు తీసుకురావాలని, అది వారికే సాధ్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు...
ప్రజాస్వామ్యంలో ప్రతి స్వరం ముఖ్యమే
మహిళలను కించపరిచే పదాలకు అడ్డుకట్టవేయాలి: మంత్రి లోకేశ్
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, సమాజంలో మార్పు తీసుకురావాలని, అది వారికే సాధ్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘యువగళం పాదయాత్ర సమయంలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరిగాను. పాదయాత్ర సమయంలో నన్ను అడ్డుకున్న పోలీసులకు ఆర్టికల్ 19లో పొందుపర్చిన రైట్ టు ఫ్రీడం గురించి చెప్పాను. వారు అదంతా మాకు తెలియదు, ఎస్పీతో మాట్లాడమని చెప్పేవారు. పిల్లలకు చిన్న వయసులోనే రాజ్యాంగం హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. స్టాన్‌ఫోర్డ్ ప్రవేశపరీక్ష సందర్భంగా రాసిన వ్యాసంలో ప్రజాసేవ, పాజిటివ్ లీడర్‌షి్‌పతో సమాజంలో మార్పు వస్తుందని రాశాను. మీరు భవిష్యత్తులో ఏ వృత్తిలోకి వెళ్లినా నైతికతను వీడొద్దు. రాజకీయాల్లో పాజిటివ్ లీడర్‌షిప్ తేవడానికి కృషి చేయండి.’ అని లోకేశ్ కోరారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 7 లక్షల మందితో పోటీపడి మీరంతా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని పోరాడాను. ఈ రోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూం ఆఫ్ డెమెక్రసీ. శాసనసభ కార్యకలాపాలన్నీ మీరు ఈ రోజు చూశారు. ఏటా ఇలాంటి కార్యక్రమం చేయాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య పరిరక్షణకు క్రమశిక్షణ, హుందాతనం ముఖ్యం. రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించే ప్రాథమిక హక్కుల గురించే కాదు, బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి స్వరం చాలా ముఖ్యం. రాజ్యాంగం భారతదేశానికి ఆత్మలాంటిది. అందుకే బాలల భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చాం. సమాజాన్ని నడిపించడంలో గురువులతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే నా తల్లి కారణం. తెలుగు వాడుక భాషలో మహిళలను కించపరిచే పదాలకు అడ్డుకట్ట వేయాలి. గాజులు తొడుక్కున్నావా.. చీర కట్టుకున్నావా.. వంటి పదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. ఇది కేవలం పుస్తకాల్లోనే కాదు, ఆచరణలోనూ అమలు చేయాలి. ఈ కార్యక్రమాన్ని 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లైవ్‌లో చూశారు. దీనిలో పాల్గొనేందుకు పోటీపడి రాలేకపోయిన వారికి ప్రభుత్వం మెరుగైన అవకాశాలు కల్పిస్తుంది’ అని లోకేశ్ తెలిపారు.