Share News

Minister Lokesh: ప్రవాసులే బ్రాండ్‌ అంబాసిడర్లు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:32 AM

రాష్ట్రం కోసం ప్రవాసాంధ్రులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు.

Minister Lokesh: ప్రవాసులే బ్రాండ్‌ అంబాసిడర్లు

  • ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం.. ఆస్ట్రేలియాలోని ప్రవాసులతో లోకేశ్‌ భేటీ

  • 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

  • కేంద్రం సహకారంతోనే గూగుల్‌ వచ్చింది.. దాంతోపాటు ఎంఎ్‌సఎంఈలూ ముఖ్యమే

  • చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసులు అండగా నిలబడ్డారు

  • ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలిపారు.. 45 వేల మంది హైదరాబాద్‌ వచ్చి పాల్గొన్నారు

  • 1995లో మాదిరిగా మ్యాజిక్‌ చేయడానికి బాబు అహర్నిశలూ కష్టపడుతున్నారు

  • అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా తీసుకెళ్తున్నారు

  • క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మాకే అర్థం కావడం లేదు.. ఆయనేమో నిశితంగా విశ్లేషిస్తున్నారు

  • అందుకే ఆయన విజనరీ.. ఇంకొకరు ప్రిజనరీ.. సిడ్నీ ప్రవాసాంధ్రుల భేటీలో వ్యాఖ్యలు

దేశంలోని చాలా రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. ఏపీలో మాత్రం డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రయిన్‌ ఉంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ కలసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

- మంత్రి లోకేశ్‌

చంద్రబాబు వయసు 75 ఏళ్లయినా.. ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిలా ఆలోచిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు. మంత్రివర్గంలో చాలామంది యువకులం ఉన్నాం. కానీ ఆయన వేగాన్ని ఆందుకోలేకపోతున్నాం.

- మంత్రి లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం కోసం ప్రవాసాంధ్రులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. అందరం ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దామని వ్యాఖ్యానించారు. తెలుగువారు మళ్లీ గర్వంగా తలెత్తుకునే రోజులు రావాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన లోకేశ్‌కు ఆదివారం సిడ్నీలో ఘనస్వాగతం లభించింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం సహకారం వల్లే గూగుల్‌ డేటా సెంటర్‌ రాష్ట్రానికి వచ్చిందన్నారు. గూగుల్‌ ఎంత ముఖ్యమో.. ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని స్పష్టంచేశారు.


కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాలు, ఎన్‌టీపీసీ గ్రీన్‌ ప్రాజెక్టు.. ఇలా అనేక కార్యక్రమాలను శరవేగంగా చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసి ఖజానాకు ఆర్థికంగా నష్టం చేస్తే.. తాము అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రవాసాంధ్రులు బ్రాండ్‌ అంబాసిడార్లుగా మారాలని అభ్యర్థించారు. ఈ 16 నెలల్లో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని.. అక్కడే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసుకున్నామని.. ఆగిపోయిన అమరావతికి నిధులు తెచ్చుకుని వేగంగా పనులు చేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని.. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఏం చెప్పారంటే..


కసితో పనిచేస్తున్నాం..

రాష్ట్రంలో 50 మంది ఎమ్మెల్యేలు కొత్తవారే. వారిలో నేనూ ఒకడిని. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారే. మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం. 1995లో చంద్రబాబు ఏ మ్యాజిక్‌ చేసి తెలుగువారు తలెత్తుకుని తిరిగేలా చేశారో అదే మ్యాజిక్‌ మళ్లీ చేయాలని ఆయన అహర్నిశలూ కష్టపడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా తీసుకెళ్తున్నారు. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు కనిపిస్తారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా తెలుగువారు లేని దేశమేదీ ప్రపంచంలో లేదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక తెలుగువాడిని అధికారిగా నియమించింది. ఆస్ట్రేలియా ప్రధానికి కూడా ఈ స్థాయిలో స్వాగతం ఉండదని సదరు అధికారి నాతో చెప్పారు. ఇక్కడి తెలుగువారి జోష్‌ వేరు. జాతర మాస్‌గా ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేశారు. సీఎంగా గద్దె దింపితే ఢిల్లీని గడగడలాడించి తిరిగి గద్దెనెక్కారు. ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటారు. 1995లో పెద్దఎత్తున సంస్కరణలు అమలు చేసి రాష్ట్రాభివృద్ధికి మార్గం చూపారు.


అప్పుడు ఎగతాళి చేశారు..

కంప్యూటర్‌ కూడు పెడుతుందా అని ఆనాడు చాలా మంది చంద్రబాబును ఎగతాళి చేశారు. ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్టా అని గేలి చేశారు. విమానాశ్రయాలు నిర్మిస్తే ఏం జరుగుతుందని ఆనాడు అవమానకరంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వారి నోట ఇప్పుడు మాట రావడం లేదు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మాకే అర్థం కావడం లేదు. చంద్రబాబు మాత్రం నిశితంగా విశ్లేషిస్తున్నారు. ఆందుకే ఆయన్ను విజనరీ అంటాం. ఇంకొకరిని (పరోక్షంగా జగన్‌ను ప్రస్తావిస్తూ) ప్రిజనరీ అంటాం. ఇప్పుడు అర్థమైందా రాజా! ఆస్ట్రేలియాలోని తెలుగువారిని నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ (ఎన్‌ఆర్‌ఐ) అంటారు. నేను మాత్రం మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్స్‌ (ఎంఆర్‌ఐ) అని అంటాను. భారతీయులు సముద్రాలు దాటి వచ్చినా తమ దేశాన్ని, పుట్టిన ఊరును మరచిపోరు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి సొంత గడ్డపై ప్రేమాభిమానాలున్నాయి.


రాజకీయాలు మనకు అవసరమా అని నాడు బ్రాహ్మణి అడిగింది

భావోద్వేగానికి గురైన లోకేశ్‌

చంద్రబాబును నాడు జగన్‌ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినప్పుడు.. రాజకీయాలు మనకు అవసరమా అని తన భార్య బ్రాహ్మణి తనను ప్రశ్నించిందని లోకేశ్‌ వెల్లడించారు. గౌరవంగా బతుకుతున్న మనం రాజకీయాలతో ఇన్ని అవమానాలు భరించాలా అని అడిగిందని చెప్పా రు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసులు ఎంతో బాధపడ్డారు. ఆయనకు, మా కుటుంబానికి మద్దతుగా నిలబడ్డారు. ఆస్ట్రేయాలోని ప్రతి నగరంలో నిరసనలు చేపట్టారు. ఆరోజు హైదరాబాద్‌కు 45 వేల మంది ప్రవాసులు వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే.. ప్రజాసేవ ద్వారా నాయకుడిగా ఆదరణ పొందేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది. మంచి నాయకుడికి ప్రపంచమే అండగా నిలిచిందని.. అందుకే రాజకీయాల్లో కొనసాగాలని ఆరోజున బ్రాహ్మణితో చెప్పాను. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ప్రవాసులు తమ తమ గ్రామాలకు వెళ్లి పార్టీలు, ఎజెండాలు చూడకుండా కూటమి అభ్యర్ధుల విజయం కోసం కష్టపడడం వల్లే 94 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో గెలిచాం. ఇలాంటి వేవ్‌ వస్తుందని నేనూహించలేదు. ఈ గెలుపు వెనుక ప్రతి ఒక్కరి కష్టం దాగి ఉంది. ఈ అద్భుత విజయం నాలో స్ఫూర్తిని నింపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మరింత కష్టపడతా’ అని హామీ ఇచ్చారు.

Updated Date - Oct 20 , 2025 | 04:33 AM