Share News

Nara Lokesh: ఎమ్మెల్యేల పనితీరును గమనించండి

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:00 AM

టీడీపీ ఎమ్మెల్యేల పనితీరులో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్సుల నిర్వహణ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మెరుగుపడింది.

Nara Lokesh: ఎమ్మెల్యేల పనితీరును గమనించండి

  • పార్టీ బలోపేతంలో మీ పాత్ర కీలకం

  • టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్ల సమావేశంలో మంత్రి లోకేశ్‌ దిశానిర్దేశం

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ ఎమ్మెల్యేల పనితీరులో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్సుల నిర్వహణ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మెరుగుపడింది. కానీ ఇంకా కొంత మంది తీరు మారాల్సి ఉంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. జోనల్‌ కో-ఆర్డినేటర్లతో పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన సమావేశంఅయ్యారు. ఈ సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ... ‘ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తూ ఎప్పటికప్పుడు పార్టీకి నివేదించాల్సిన బాధ్యత జోనల్‌ కో-ఆర్డినేటర్లపై ఉంది. అందరికీ పార్టీనే సుప్రీం. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తు.చ. తప్పకుండా పాటించాలి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉందో క్షేత్రస్థాయిలో కో-ఆర్డినేటర్లు పర్యవేక్షించాలి. ఏమైనా లోపాలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో 5 శాతం కమిటీలు ఇంకా పెండింగ్‌ ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి. నామినేటెడ్‌ పదవులు పెండింగ్‌లో ఉన్న చోట కూటమి పార్టీల నాయకులతో మాట్లాడి వీలైనంత త్వరలో భర్తీ చేయాలి. కో-ఆర్డినేటర్లు, ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలోని జిల్లాల్లో నెలలో కనీసం రెండు రోజులు ఉండాలి. కో-ఆర్డినేటర్లు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించాలి’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. జిల్లాల్లో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయాల నమూనాలను ప్రదర్శించి కో-ఆర్డినేటర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం గురించి ఇన్‌చార్జి మంత్రితో కో-ఆర్డినేటర్లు చర్చించాలని, వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 05:00 AM