Share News

Nara Lokesh: మేము మిస్సైళ్లం

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:29 AM

కూటమి ప్రభుత్వం ‘ఒక రాష్ట్రం..ఒకే రాజధాని’ని నమ్ముతూ అభివృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

Nara Lokesh: మేము మిస్సైళ్లం

  • చంద్రబాబు, అశోక్‌, అయ్యన్న జీపీఎస్‌లు

  • అభివృద్ధి వికేంద్రీకరణకే కూటమి పెద్దపీట: లోకేశ్‌

  • జీఎంఆర్‌-మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుసిటీని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

  • విశ్వ పౌరవిమాన దళంలో 25శాతం మనోళ్లే ఉండాలి

  • ఎడ్యుసిటీకి రూ.వందల కోట్ల భూములనుమాన్సాస్‌ ట్రస్టు ఉచితంగా ఇచ్చింది

  • పూసపాటి వంశీయుల ఉదారతకిది నిదర్శనం

  • ‘జీఎంఆర్‌-మాన్సాస్‌’ ఎంవోయూకు లోకేశ్‌ హాజరు

ఇటీవల బిహార్లో సీఎం నితీశ్‌కుమార్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లినప్పుడు.. ఏపీలో గత 18 నెలలుగా ఏదో మ్యాజిక్‌ జరుగుతోందని, దాని రహస్యం ఏమిటని ఆయన అడిగారు. ఒక కారణం మిస్సైల్‌ (నేను) అయితే.. రెండోది దానిని గైడ్‌ చేసే జీపీఎస్‌ (చంద్రబాబు) అని చెప్పా. ఏ మిస్సైల్‌ లక్ష్యాన్ని సాధించాలన్నా జీపీఎస్‌ తప్పనిసరి.

- మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ‘ఒక రాష్ట్రం..ఒకే రాజధాని’ని నమ్ముతూ అభివృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. ఆ దిశగానే పరిపాలన సాగిస్తున్నదని వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం సమీపాన మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో ఏర్పాటుచేసే జీంఎఆర్‌-మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుసిటీని ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఎడ్యుసిటీకి భూములిచ్చిన మాన్సాస్‌ ట్రస్టు, జీఎంఆర్‌ గ్రూపు మధ్య మంగళవారం విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరిగిన అవగాహన ఒప్పంద (ఎంవోయూ) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో జీఎంఆర్‌ అభివృద్ధి చేసే ఎడ్యుసిటీకి మాన్సాస్‌ ట్రస్టు రూ.వందల కోట్ల విలువ చేసే తన భూములను ఉచితంగా ఇచ్చిందని, ఇది పూసపాటి వంశీయుల ఉదారతకు నిదర్శనమని కొనియాడారు. ఇందుకు గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు, విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజులకు ఽకృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి యువ నాయకులంతా మిస్సైళ్లలా పనిచేస్తుంటే.. సీనియర్‌ నాయకులు జీపీఎ్‌సలా మార్గదర్శకత్వం చేస్తున్నారని తెలిపారు. ‘సీఎం చంద్రబాబు, అశోక్‌ గజపతిరాజు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు జీపీఎ్‌సలైతే.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అదితి, నేను మిస్సైళ్లం’ అని స్పష్టంచేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంరఽధల్లో అక్కడి వనరులకు తగిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.విజయనగరం పూసపాటి రాజుల కుటుంబం నుంచి ఏవియేషన్‌ రంగంలోకి వెళ్లిన అలక్‌ నారాయణ్‌ పైలట్‌గా పనిచేశారని, ఆయన పేరుతోనే మాన్సాస్‌ విద్యా సంస్థల ట్రస్టును ఏర్పాటు చేశామని అశోక్‌గజపతిరాజు చెప్పారు. ఇంతకు ముందు చంద్రబాబు, ఎర్రన్నాయుడు, తాను కలిసి టీమ్‌ వర్క్‌తో పనిచేశామని.. ఇప్పుడా బాధ్యతను లోకేశ్‌, రామ్మోహన్‌నాయుడు, అదితిలకు అప్పగించామన్నారు. ఒప్పంద పత్రాలను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చైర్మన్‌ బీజీఎస్‌ రాజు, మాన్సాస్‌ ట్రస్టు తరఫున అదితి మార్చుకున్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..


భోగాపురంలో అనుకున్నాం..

ముందుగా భోగాపురంలో ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ చర్చలు జరుగుతున్న సమయంలో విశాఖ టీడీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే అదితి ఒక మ్యాప్‌ తీసుకుని వచ్చారు. భోగాపురం ప్రాంతంలో మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన భూములను అందులో చూపించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎడ్యుసిటీని ఏర్పాటు చేస్తే ట్రస్టు భూములు ఉచితంగా ఇస్తామన్నారరు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడుతుందని ఉచితంగా ఇస్తామన్నారు. అది వారి గొప్పతనం. అయితే ఒకరోజు సీఎం కార్యదర్శి ఫోన్‌ చేసి.. ఉచితంగా భూమి ఇస్తున్నట్లు ఫైలులో రాశారు.. అలా కుదరదు.. కనీస ధర ఎంతో కొంత తీసుకుంటే బాగుంటుందని సూచించారు. ఇదే విషయం అదితికి చెబితే ఒక్క రూపాయి కూడా తీసుకోబోమని, ఉచితంగా ఇస్తామన్నారు. సంస్థకు మాన్సాస్‌ పేరు పెడితే చాలని చెప్పారు. ఏవియేషన్‌ వర్సిటీపై సీఎంను కలిసినప్పుడు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండాలని, అన్ని విభాగాలకూ అవకాశం ఉండాలన్నారు. దాంతో ప్రతి విభాగానికో వర్సిటీని ఎడ్యుసిటీలో ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచానికి అవసరమైన పౌరవిమానయాన సిబ్బందిలో 25 శాతాన్ని మన రాష్ట్రం నుంచే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలోని ఏవియేషన్‌ వర్క్‌ఫోర్స్‌లో కనీసం 70 శాతం తెలుగువారు ఉండాలి. ఎడ్యుసిటీ పనులు వచ్చే ఫిబ్రవరిలో మొదలుపెట్టి ఏడాదిలో పూర్తి చేయాలనేది లక్ష్యం.


99 పైసలకు భూమి ఇవ్వడం వల్లే..

ఎకరా భూమి 99 పైసలకే ఇస్తే చాలామంది విమర్శలు చేశారు. అయితే దాని వల్లే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ సంస్థలు ఏపీకి వచ్చాయి. ఇంకో మూడు నెలల్లో మరో రెండు పెద్ద కంపెనీలు విశాఖకు వస్తాయి. విద్యా రంగాన్ని, పరిశ్రమలతో అనుసంధానం చేసి వాటికవసరమైన వర్క్‌ ఫోర్స్‌ను అందిస్తాం. యువత చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ముందుచూపు లేనివారంతా విజన్‌ కలిగిన వారిని ఎగతాళి చేస్తున్నారు. అలాంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు. హైదరాబాద్‌లో శంషాబాద్‌ విమానాశ్రయానికి రూపకర్త చంద్రబాబే. దానికి అప్పట్లో ఐదు వేల ఎకరాలు అవసరమా అని అనుమానాలు వ్యక్తంచేశారు. చెన్నై, బెంగుళూరు వంటి నగరాలు రెండో విమానాశ్రయం నిర్మించుకుంటున్నాయి. హైదరాబాద్‌కు ఆ అవసరం లేకుండా చంద్రబాబు చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఒక్కటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జీడీపీలో 12 శాతం సమకూరుస్తోంది.

ఎంవోయూకు ప్రభుత్వం అనుమతి

అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘జీఎంఆర్‌ మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుసిటీ’కి రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి అవసరమైన 136.63 ఎకరాల భూమిని మాన్సాస్‌ ట్రస్టు నుంచి కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి హరిజవహర్‌ లాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీఎంఆర్‌తో ఎంవోయూ కుదుర్చునేందుకు ట్రస్టు తరఫున దేవదాయ శాఖ కమిషనర్‌, ఈవోకు అనుమతిచ్చింది. ఎడ్యుసిటీకి కేటాయించిన భూములను కేటాయించిన ఆ ప్రాజెక్టుకే ఉపయోగించాలని.. అలా కాని పక్షంలో భవిష్యత్‌లో ఆ భూములు మొత్తం తిరిగి మాన్సాస్‌ ట్రస్టుకు చెందేలా ఎంవోయూలో పొందుపరిచారు.

Updated Date - Dec 17 , 2025 | 04:33 AM