Minister Lokesh: సిఫీకి నేడే శ్రీకారం
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:52 AM
విశాఖపట్నంలో సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి లోకేశ్...
విశాఖలో లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన
ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్
స్టేషన్ ఏర్పాటు చేస్తున్న సిఫీ
రెండేళ్లలో ఆపరేషన్లు ప్రారంభం
అమరావతి/విశాఖపట్నం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి లోకేశ్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ‘సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్’ విశాఖపట్నంలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు రూ.15 వేల కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల భూమి కావాలని సిఫీ కోరగా రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రాంతాల్లో 28.6 ఎకరాలు కేటాయించింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్ నంబరు 3పై 3.6 ఎకరాలు, అలాగే పరదేశిపాలెం సర్వే నంబరు 134లో మరో 25 ఎకరాలు కేటాయించింది. రుషికొండలో ఎకరా రూ. కోటి చొప్పున, పరదేశిపాలెంలో రూ. 50 లక్షల చొప్పున ఇచ్చారు. భూమి పూజ చేసినప్పటి నుంచి రెండేళ్లలో అంటే 2027 అక్టోబరు 12వ తేదీ నాటికి డేటా సెంటర్ ఆపరేషన్‌లోకి తీసుకురావాలనే నిబంధనతో తక్కువ ధరకు భూములు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం ‘సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్’ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
డేటా సెంటర్ల కేంద్రంగా విశాఖ
అదానీ, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్, సిఫీతో పాటు టీసీఎస్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వస్తుండటంతో డేటా సెంటర్ల హబ్‌గా విశాఖ మారుతోంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కేంద్రంగా అవతరిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు భూముల కేటాయింపునకు శుక్రవారం నాటి క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. ఈనెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సమక్షంలో రైడెన్ అధికారిక ప్రకటన చేయనుంది. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గతంలోనే అనుమతులు లభించాయి. ఇక ఇక్కడ ఏర్పాటవుతున్న డేటా సెంటర్లతో డేటా కేబుళ్లను అనుసంధానించడానికి సిఫీ టెక్నాలజీస్ సిద్ధమైంది. సిఫీ సముద్రగర్భ కేబుల్ కనెక్టివిటీతో రాష్ట్రంలో ఏఐ ఆధారిత సాంకేతిక విప్లవం రాబోతోందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడి భారత్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందని వివరించారు. కాగా, సిఫీకి శంకుస్థాపన తరువాత మంత్రి లోకేశ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ క్రికెట్ మ్యాచ్‌ను తిలకిస్తారు.