Nara Lokesh: సవాళ్లకు సై అంటేనే..
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:33 AM
విద్యార్థులు తమకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్నపుడే జీవితంలో పైకి ఎదుగుతారని మంత్రి లోకేశ్ అన్నారు. మంత్రి నారాయణ నేతృత్వంలో నెల్లూరులో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూలును సోమవారం లోకేశ్ ప్రారంభించారు.
జీవితంలో ఎదుగుదల సాధ్యం
తొలిసారి ఓడిన మంగళగిరిలోనే భారీ మెజారిటీతో గెలిచాను
విద్యా శాఖ మంత్రి పదవిని ఒక సవాల్‌గా స్వీకరించా: లోకేశ్
నెల్లూరులో వీఆర్ స్కూల్ ప్రారంభం
నేను చదివిన స్కూలు కన్నా బాగుంది
రాష్ట్రమంతా నియోజకవర్గానికి ఒక్కటైనా ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తాం
ఏడాదిలోపు మంగళగిరిలో: మంత్రి
నెల్లూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తమకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్నపుడే జీవితంలో పైకి ఎదుగుతారని మంత్రి లోకేశ్ అన్నారు. మంత్రి నారాయణ నేతృత్వంలో నెల్లూరులో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూలును సోమవారం లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సవాళ్లను స్వీకరిస్తేనే ఫలితం ఉంటుందని, అందుకు తన జీవితాన్నే ఉదాహరణగా వివరించారు. ‘‘మంగళగిరి నియోజకవర్గంలో 1980ల్లో ఎప్పుడో ఒకసారి తప్ప తెలుగుదేశం గెలిచింది లేదు. అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేశాను. తొలి ఎన్నికల్లో ఓడిపోయాను. మొన్నటి ఎన్నికల్లో ఎవరూ సాధించనంత భారీ మెజారిటీతో గెలిచాను. ఐదేళ్ల పాటు రేయింబవళ్లు ఆ నియోజకవర్గ ప్రజల కోసం పని చేయడమే ఇందుకు కారణం. విద్యా శాఖ మంత్రి పదవి కూడా ఒక సవాల్‌గానే స్వీకరించాను. అందరూ వద్దన్నారు. ఉపాధ్యాయ సంఘాలను సంతృప్తి పరచడం కష్టమన్నారు. విద్యా శాఖను మార్చగలిగితే ఏ శాఖనైనా మార్చగలననే నమ్మకంతో, పట్టుదలతో ముందుకు వెళుతున్నా. సృష్టిలో అందరికన్నా ఎక్కువ భారం మోసేది తల్లి. ఆ తల్లి భారాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డ చదువుకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. మంత్రి పదవిని ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకున్నా. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్న కూడా చెట్లు పెంచాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నారు. ఆయన సూచనల మేరకు పాఠశాలల్లో గ్రీన్ పాస్‌పోర్టు ప్రారంభిస్తాం. ప్రతి విద్యార్థి ఒక మొక్కను మూడేళ్లు పెంచాలి. దానిని ఉపాధ్యాయుడు పరిశీలించి మార్కులు వేస్తారు. ‘ఒక క్లాస్ ఒక టీచర్’ అనే నినాదంతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వాడబోతున్నాం’’ అని లోకేశ్ అన్నారు.
వీఆర్ స్కూలు అద్భుతం
‘‘సమాజంలో ఉన్న నిరుపేదలను, సంపన్నుల సహకారంతో కాస్త పైకి తేవడానికి ప్రవేశపెట్టిన పీ4 పథకం ఎలాంటి మార్పులు తెస్తోందో వీఆర్ స్కూలు చూసిన తరువాత అర్థమయ్యింది. ఈ స్కూలు చూసి ఆశ్చర్యపోతున్నా. నేను చదువుకున్న స్కూలు కన్నా బాగుంది. మంగళగిరిలో ఇలాంటి స్కూలు లేదనే ఈర్ష్య కూడా కలుగుతోంది. ఆరు నెలల క్రితం శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన విద్యాలయంగా మార్చిన మంత్రి నారాయణను, ఆయన కుమార్తె షరిణిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దక్షిణ భారత దేశంలోనే ఇలాంటి ప్రమాణాలు గల ప్రభుత్వ పాఠశాల మరొకటి లేదు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం నియోజకవర్గానికి ఒక్కటైనా ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోపు మంగళగిరిలో కూడా ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తాను. వసతులతో పాటు విద్యాప్రమాణాలు, ఫలితాల్లో కూడా నారాయణ మాస్టర్‌తో పోటీ పడతాను’’ అని అన్నారు. పీ-4 కింద ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు, నారాయణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధి షరిణి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని లోకేశ్ సత్కరించారు. మరింత మంది దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సరదాగా క్రికెట్.. వాలీబాల్
వీఆర్ స్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా లోకేశ్ పాఠశాల ఆవరణం మొత్తం కలియతిరిగారు. క్లాస్ రూంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు, హైడ్రోఫోనిక్ ల్యాబ్‌లు, యాక్టివిటీ హాలు తదితరాలను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసిన ప్లే గ్రౌండ్ చూసి లోకేశ్ సంతోషించారు. కాసేపు క్రికెట్ ఆడి బ్యాటింగ్ చేశారు. వాలీబాల్ ఆడారు. తనతో పాటు ఆడాలని విద్యార్థులను ప్రోత్సహించారు. మైదానమంతా తిరిగారు.
నారాయణకు అభినందనలు
గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థతో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి భ్రష్టుపట్టించిందనడానికి వీఆర్ స్కూలే ఉదాహరణ అని మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహకారంతో ఈ పాఠశాలను పునఃప్రారంభించామన్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి కారణమైన మంత్రి నారాయణను అభినందించారు.
ఆరోగ్య రొట్టె పట్టుకున్న లోకేశ్
నెల్లూరు బారాషాహీ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో లోకేశ్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఆరోగ్య రొట్టెను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటూ తాను ఆరోగ్య రొట్టె పట్టుకున్నానని తెలిపారు. సుమారు రెండు గంటల పాటు దర్గా ప్రాంగణంలో భక్తుల మధ్య గడిపారు. భక్తులను పలుకరించి సౌకర్యాలపై ఆరా తీశారు.
ఇద్దరు యాచక పిల్లల దత్తత
ఇద్దరు యాచకుల పిల్లలను మంత్రి లోకేశ్ దత్తత తీసుకున్నారు. వారి ఉన్నత చదువుల వరకు వారి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీఆర్ హైస్కూలు క్రీడా మైదానంలో ఆడుకుంటున్న యాచిక వృత్తికి చెందిన ఇద్దరు చిన్న పిల్లలను మున్సిపల్ కమిషనర్ నందన్ చూసి, మంత్రి నారాయణ వద్దకు తీసుకెళ్లారు. వారి పేర్లు పెంచలయ్య, వెంకటేశ్వర్లు. ఇక్కడ చదువుకుంటారా? అని మంత్రి వారిని అడిగారు. స్కూలులో చేర్చుకుంటే చదువుకుంటామని పిల్లలు చెప్పారు. నారాయణ ఈ విషయాన్ని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు నగరంలో యాచక వృత్తిలో ఒక బడి ఈడు పిల్లాడు కూడా ఉండటానికి వీల్లేదని, అలాంటి వారిని గుర్తించి వీఆర్ స్కూలులో అడ్మిషన్ కల్పించాలని లోకేశ్ అన్నారు. పెంచలయ్య, వెంకటేశ్వర్లును దత్తత తీసుకొంటున్నట్టు సభా వేదికపై ప్రకటించారు. వారు ఉన్నత చదువులు చదివే వరకు విద్యాపరంగా అవసరాలన్ని తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు.
కార్పొరేట్‌కు దీటుగా వీఆర్ హైస్కూల్
నెల్లూరులో ఘన చరిత్ర గల వీఆర్ (వెంకటగిరి రాజాస్) హైస్కూల్ పూర్వవైభవం సంతరించుకుంది. అత్యాధునిక హంగులతో ఈ పాఠశాల రూపుదిద్దుకుంది. 1875లో ప్రారంభమైన వీఆర్ విద్యా సంస్థలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతోమంది ఇక్కడే చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి మహోన్నత పాఠశాల గత వైసీపీ ప్రభుత్వంలో మూతపడింది. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ, నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ఈ స్కూలును సుమారు రూ.15 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విద్యా సంస్థలో వెయ్యిమంది నిరుపేద విద్యార్థులు అడ్మిషన్లు పొంది డిజిటల్ విద్యను అందుకోబోతున్నారు. ప్యానల్ బోర్డులు, ల్యాబ్‌లు, అత్యాధునిక ఆటస్థలం, బెంచీలు, విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, ఆరు జతల యూనిఫాం వంటి వసతులతో నెల్లూరుకే తలమానికంగా నిలుస్తోంది. ఉదయం, సాయంత్రం అల్పాహార విందు, మధ్యాహ్న భోజనం, బడికి దగ్గరగా ఉన్న విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, దూరంగా ఉన్నవారికి బస్ సౌకర్యం కల్పిస్తూ కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా ఉత్తమ విద్యను అందించనున్నారు.