Nara Lokesh: నిర్మాణ లోపం.. నిర్వాహకుల వైఫల్యం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:14 AM
కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శనివారం హుటాహుటిన పలాస ఆస్పత్రికి చేరుకొని...
విషాదానికి ఇదే కారణం: లోకేశ్
మృతుల కుటుంబాలకు 15 లక్షలు
కేంద్రం నుంచి మరో 2 లక్షలు
క్షతగాత్రులకు రూ.3.5 లక్షలు
శ్రీకాకుళం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శనివారం హుటాహుటిన పలాస ఆస్పత్రికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సహాయాన్ని ప్రకటించారు. మృతి చెందిన 9 మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15లక్షలు, కేంద్రప్రభుత్వం రూ. 2లక్షలు కలిపి మొత్తం రూ.17 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్రం నుంచి రూ.3లక్షలు, కేంద్రం నుంచి రూ.50వేలు కలిపి మొత్తం రూ.3.5 లక్షలు ఇస్తామన్నారు. మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద తక్షణ సహాయంగా రూ.10వేల పరిహారం లభిస్తుందన్నారు. మృతుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున బీమా కింద ఒక్కొక్కరికి అదనంగా రూ.5లక్షల చొప్పున సాయం అందుతుందని మంత్రి వెల్లడించారు.
లోపాలపై పూర్తిస్థాయిలో విచారణ..
తొక్కిసలాట 17 మంది క్షతగాత్రులు కాగా, వారిలో ముగ్గురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారని లోకేశ్ తెలిపారు. ఆలయం నిర్మించి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. దశలవారీగా గుడి నిర్మాణం జరిగిందని, నిర్మాణంలో లోపాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.