Nara Lokesh: పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:55 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్ అన్నారు.
ప్రోత్సాహకాలు వేగంగా విడుదల చేస్తాం: లోకేశ్
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. వ్యాపారాల అభివృద్ధికి అతివేగంగా అనుమతులివ్వడమే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని చెప్పారు. కంపెనీల కంటే ప్రభుత్వమే వేగంగా స్పందిస్తోందన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలు పెట్టే పెట్టుబడులను ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి అన్నివిధాలా సహకరిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా అండగా ఉండేందుకు వీలుగా త్వరితగతిన ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నామన్నారు. దేశానికి ఏపీ గ్రోత్ ఇంజన్‌లా, ఏపీకి విశాఖ గ్రోత్ కారిడార్‌లా తయారవుతాయని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధి చెందడానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ సహకరిస్తున్నారని లోకేశ్ అన్నారు. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ... రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు మంజూరుచేస్తున్న కేంద్రం, వాటి అమలుకు అన్ని విధాలా సాయపడుతుందన్నారు. చంద్రబాబు బ్రాండ్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఏపీలో పరిశ్రమల కోసం 550 పారిశ్రామిక పార్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు.