Praja Darbar: సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ హామీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:39 AM
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శనివారం 79వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది.
79వ రోజు ప్రజా దర్బార్‌లో వినతుల స్వీకరణ
మంగళగిరి సిటీ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శనివారం 79వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న లోకేశ్ పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని, వైసీ పీ హయాంలో ఆ సర్క్యులర్‌ను అమలు చేయకపోవడంతో తీ వ్రంగా నష్టపోయామని వాపో యారు. టీడీపీ సానుభూతిపరులమనే కక్షతో వైసీపీ హయాం లో అప్పటి ఎమ్మెల్యే కాపు రామ చంద్రరావు ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్లా బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ రెండున్నర ఎకరాల భూమిని వైసీపీకి చెందిన బి.నాగిరెడ్డి, బి.శివరామిరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలేనికి చెందిన ఎం.శారదాంబ, ఎం.సునీత కోరారు.