Nara Lokesh: ఉత్తరాంధ్ర ఏపీకే తలమానికం
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:16 AM
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని, ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా తయారు చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు.
మరో 15 ఏళ్లు కూటమిదే అధికారం
గత ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు నాపైనే 23 కేసులు పెట్టారు
రప్పా రప్పా బ్యాచ్‌కు బుద్ధి చెప్పాం: లోకేశ్
పార్వతీపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని, ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా తయారు చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం లివిరి గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆయన పాలకొండ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఉత్తరాంధ్రలో 33 అసెంబ్లీ సీట్లు ఉండగా, 31 సీట్లను ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఇచ్చారని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నామని, ఐటీ తదితర కంపెనీలను ఉత్తరాంధ్ర జిల్లాలకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో మేరకు ప్రాధాన్య క్రమంలో హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిసున్నామన్నారు. సామాజిక పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనివిధంగా ఏపీలో లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. కూటమి ఐక్యత ఎల్లప్పుడూ ఉంటుందని, చిన్నపాటి సమస్యలు వచ్చినా కుటుంబసభ్యుల మాదిరిగా చర్చించి సమస్య పరిష్కరించుకుంటామని తెలిపారు. 2019-24 మధ్య ఒక సైకో పాలన కొనసాగిందని, ఈ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
కత్తులతో దాడులు చేసినా జై చంద్రబాబు అంటూ నినాదాలు ఇచ్చిన తోట చంద్రయ్య ప్రతి టీడీపీ కార్యకర్తకూ ఆదర్శమన్నారు. కార్యకర్తల కష్టం, శ్రమ ఫలితంగానే కూటమి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ప్రతీ కార్యకర్త రోడ్డుపైకి వచ్చి మద్దతు తెలపడాన్ని తాను ఎప్పుడూ మరిచిపోనని అన్నారు. గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో వారి సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కును కాపాడిన ఘనత ఎన్‌డీఏ ప్రభుత్వానిదేనని లోకేశ్ అన్నారు. మెగా డీఎస్సీకి వైసీపీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా, 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. దళిత డ్రైవర్‌తో పాటు డాక్టర్ సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా అంజిరెడ్డి తాత నామినేషన్ వేసేందుకు వెళ్లగా, వైసీపీ నాయకులు లాక్కోవడానికి ప్రయత్నిస్తే తొడకొట్టి నామినేషన్ వేశారని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అధికారులు గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తనపై 23 కేసులు పెట్టారని లోకేశ్ చెప్పారు. రప్పా రప్పా బ్యాచ్‌కు తగిన బుద్ధి చెప్పామన్నారు.