Minister Lokesh: రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:47 AM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రులకు లోకేశ్ అభ్యర్థన
నిర్మల, నడ్డా, గడ్కరీ, పురీ, సొనోవాల్, జైశంకర్, వైష్ణవ్, పీయూష్‌లతో భేటీ
యూరియా కొరత తీర్చండి.. కానూరు-బందరు రోడ్డు విస్తరించండి
డేటా సిటీ స్థాపనకు చేయూతనివ్వండి.. బీపీసీఎల్ రిఫైనరీకి సహకరించండి
దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి చేయండి.. విదేశాల్లోని 35 లక్షల మంది ప్రవాసాంధ్రుల సంక్షేమానికి బీమా స్కీంలు విస్తరించండి
ప్లాస్టిక్ పార్క్‌కు సహకరించండి.. విశాఖలో నైపర్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయండి.. క్వాంటమ్ వ్యాలీకి రూ.1,000 కోట్లివ్వండి
టాటా ఇన్నోవేషన్ హబ్‌కు మరో 300 కోట్లు.. కేంద్ర మంత్రులకు వినతులు
ఎల్లుండికల్లా 29 వేల టన్నుల యూరియా అందిస్తామని నడ్డా హామీ
న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డా.. ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. విదేశాంగ మంత్రి జైశంకర్.. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ.. షిప్పింగ్, ఓడరేవులు, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సొనోవాల్.. రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో వరుస భేటీలు నిర్వహించారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ బృందం సింగపూర్‌లో పర్యటించిందని, వివిధ రంగాల్లో రాష్ట్రాభివృద్ధికి ఆ దేశ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, రాజధాని అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలిసారిగా పార్లమెంటు ప్రాంగణంలోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు.
ఆయన్ను పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీ, జనసేన ఎంపీలు ఘనంగా సత్కరించారు. అలాగే నిర్మలా సీతారామన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను కూడా లోకేశ్ కలిశారు. రాష్ట్రంలో జీడి, మామిడి, మిర్చి బోర్డులు ఏర్పాటుచేయాలని కోరారు.
ముమ్మరంగా సాగు పనులు..
ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, యూరియా కొరత ఉందని, వెంటనే కేటాయించాలని నడ్డాను లోకేశ్ విజ్ఞప్తి చేశారు. నడ్డా సానుకూలంగా స్పందించారు. బుధవారం (21వ తేదీ) నాటికి 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ కోరారు. విశాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని, ఇందుకు వందెకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు.
వలస వెళ్లే కార్మికుల సంక్షేమానికి బీమా..
విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను లోకేశ్ కోరారు. ‘సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవం కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించండి. ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. వలస కార్మికులకు ఓవర్సీస్ శిక్షణ, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్‌ట్రాక్ అనుమతులు, నిధులు ఇవ్వండి. యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి డేటా షేరింగ్‌కు సహకరించండి’ అని కోరారు.
జలరవాణాకు సహకరించండి..
మారిటైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జల రవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి సొనోవాల్‌ను లోకేశ్ కోరారు. రాష్ట్ర విభజన చట్టం కింద హామీ ఇచ్చిన దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. అక్కడ ప్రధాన ఓడరేవుతోపాటు 2వేల ఎకరాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం, మరమ్మతుల కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, పోర్టు అనుబంధ రంగాల్లో రూ.26 వేల కోట్ల పెట్టుబడులతో ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 30 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని వివరించారు. సాగర్‌మాలలో రాష్ట్రంలో రూ.1.14 లక్షల కోట్ల విలువైన 110 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ యాంకరేజ్ పోర్టుల్లో వార్ఫులు, స్లిప్‌వేల అప్‌గ్రేడ్, జీవవైవిధ్యం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గోదావరి-కృష్ణా నదులపై కొత్త జలరవాణా మార్గాలు, కార్గో టెర్మినల్స్, ఫ్లోటింగ్ జెట్టీల అభివృద్ధికి రూ.127.5 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
క్వాంటమ్ వ్యాలీకి ఆర్థిక సాయం..
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించాలని మంత్రి అశ్వినీ వైష్టవ్‌ను లోకేశ్ కోరారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటి జాతీయస్థాయి క్వాంటమ్ క్లస్టర్‌గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్కుకు, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్‌కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఆమోదం తెలపాలని విజ్జప్తి చేశారు. క్వాంటమ్ వ్యాలీకి రూ.1,000 కోట్లు, రతన్ టాటా హబ్‌కు రూ.300 కోట్లు సాయం అందించాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎమ్‌ఎస్‌ఎంఈల ప్రోత్సాహానికి కేంద్ర మంత్రి అంగీకరించారు.
సత్వరమే రిఫైనరీ కార్యకలాపాలు
రాష్ట్రంలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకరించాలని పెట్రోలియం మంత్రి పురీని లోకేశ్ కోరారు. ఈ ఏడాది చివరికి బీపీసీఎల్ రిఫైనరీని ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నామని, కేంద్రం తన వంతుగా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు తోడ్పాటునివ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో దీపం-2 పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు ప్రతిఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లను అందజేస్తున్నామని, దీనిని ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)తో అనుసంధానం చేయాలని కోరారు.
రాధాకృష్ణన్ క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు: లోకేశ్
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థ సేవలు అందించడానికి ఆయనకు ఉపకరిస్తుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీలు ఉన్నారు.
హైదరాబాద్-గొల్లపూడి ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించండి
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు-మచిలీపట్నం నడుమ ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీని లోకేశ్ అభ్యర్థించారు. ‘హైదరాబాద్-అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిది కీలక పాత్ర. ఇప్పటికే మంజూరైన హైదరాబాద్-గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా డీపీఆర్‌లో చేర్చండి. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకరించండి. ఎన్ హెచ్-16 వెంబడి విశాఖలో 20 కిమీ, విజయవాడలో 14.7 కిమీ మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్ల కోసం నాగపూర్ మోడల్‌లో అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశాం. కర్నూలు-ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ-గుంటూరు మధ్య ఎన్‌హెచ్ 544డీ, కాకినాడ పోర్టు-ఎన్‌హెచ్ 216 మధ్య దక్షిణ రహదారి, కాణిపాకం వినాయక దేవాలయం లింక్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి. బెంగళూరు-చెన్నై రహదారికి నేరుగా కనెక్టివిటీ కోసం రూ.3 వేల కోట్లతో కుప్పం-హోసూరు-బెంగళూరు మధ్య 56 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయండి’ అని తెలిపారు.