Nara Lokesh: విశాఖలో జీసీసీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:04 AM
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఉన్న ఏఎన్‌ఎస్సార్.. విశాఖలో ప్రత్యేక ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపించనుంది. ఇందుకోసం ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ సమక్షంలో బెంగళూరులో...
మధురవాడలో ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు
బెంగళూరులో ఏఎన్‌ఎస్సార్‌తో ఒప్పందం
10 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం
నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
ఇందులో ఐటీ, జీసీసీఎస్ రంగాల్లో 5 లక్షలు
విశాఖ నుంచే ప్రయాణానికి శ్రీకారం
ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తాం: లోకేశ్
ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రతిష్ఠాత్మక సంస్థలకు గమ్యంగా మారుతుంది
ఏఎన్‌ఎస్సార్ సీఈవో ఆహూజా వెల్లడి
బెంగళూరు/అమరావతి/విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఉన్న ఏఎన్‌ఎస్సార్.. విశాఖలో ప్రత్యేక ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపించనుంది. ఇందుకోసం ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ సమక్షంలో బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. దీనిపై ఏఎన్‌ఎ్‌సఆర్ సంస్థ సీఈవో లలిత్ ఆహూజా, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సంతకాలు చేశారు. మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు ద్వారా ఐదేళ్లలో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. సంస్థ సీఈవో లలిత్ ఆహూజా మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ నాయకత్వం మేలుకలయికగా ఉండే విశాఖలో అద్భుతాలు సాధ్యం కానున్నాయని తెలిపారు. ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచ స్థాయి ప్రతిష్ఠాత్మక సంస్థలకు గమ్యంగా మారుతుందని చెప్పారు. లోకేశ్ మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఐటీ జీసీసీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ టార్గెట్ అన్నారు. 5 లక్షల ఉద్యోగాల టార్గెట్‌లో ఇప్పటికే 12 శాతం సాధించామని చెప్పారు. బెంగళూరు, గోవా మేలు కలయికగా విశాఖ కూడా వ్యాపార, వాణిజ్యాలకు అనువైన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ప్రతిభావంతులకు వేదిగా మారబోతోందన్నారు. ప్రభుత్వ విధానాల మేరకు అక్కడ ఐటీ రంగం వృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆర్థిక వృద్ధి వ్యూహంలో జీసీసీదే కీలకపాత్రగా లోకేశ్ వెల్లడించారు.
కొద్ది నెలల్లోనే ఐటీ రంగంలో గ్లోబల్ ప్లేయర్లను ఆకర్షించడం తమ తొలి విజయమన్నారు. జీసీసీలను స్ట్రాటజిక్ హబ్‌లుగా మార్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా టీసీఎస్, కాగ్నిజెంట్‌లకు ఎకరా 99 పైసలకే భూములు అప్పగించామని తెలిపారు. జాతీయ స్థాయిలో టాప్ 100 ఐటీ కంపెనీలకు రాష్ట్రానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. కేవలం ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా.. ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జీసీసీల అవసరరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, క్లౌడ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌ను బలోపేతం చేస్తూ.. టాలెంట్ పైప్‌లైన్ కోసం పలు కంపెనీలతో కలసి పని చేస్తున్నామని వెల్లడించారు.
విశాఖ వైపు ప్రపంచ సంస్థలు..
విశాఖ నగరంపై ఇప్పటికే ప్రపంచ స్థాయి సంస్థలు దృష్టి సారించాయని లోకేశ్ చెప్పారు. ‘గూగుల్ అమెరికా వెలుపల ఇక్కడే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించబోతోంది. ఇక్కడ హైపర్ స్కిల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ ల్యాబ్‌లు, ఎనలిటిక్ హబ్‌లు, కంప్యూటింగ్ క్లస్టర్లు ఉంటాయి. ప్రపంచంలోనే డిజిటిల్ లీడర్‌షి్‌పకు ఏపీ సిద్ధంగా ఉందనడానికి ఇదొక సంకేతం. ఎమర్జింగ్ సిటీస్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా అమరావతి, తిరుపతి, అనంతపురం, కాకినాడ వంటి నగరాల్లో స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. గ్లోబల్ సిటీ విశాఖకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ కోసం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నాం. విశాఖ నగరాన్ని ప్రపంచ జీసీసీ నూతన రాజధానిగా మార్చేందుకు ఏఎన్‌ఎస్సార్ మాతో కలసి పనిచేయాలని కోరుతున్నాం. విశాఖలో నూతనాధ్యాయం కోసం మేం చేస్తున్న కృషిలో భాగస్వాములవ్వాలి’ అని పిలుపిచ్చారు. వాస్తవానికి.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఏఎన్‌ఎస్సార్ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్‌హౌస్ కేప్టివ్ యూనిట్ల ఏర్పాటుకు 2017 అక్టోబరులోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పట్లోనే ఈ సంస్థకు రుషికొండ ఐటీ సెజ్‌లో పది ఎకరాలు కేటాయించారు. అయితే అనుకోని పరిణామాలతో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించలేకపోయింది. ఇప్పుడు ఏపీలో ఐటీకి మంచి పాలసీలు పెట్టి, ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహం అందిస్తుండడంతో మళ్లీ ముందుకొచ్చింది.