అమలాపురంలో సీఐపై విశ్వరూప్ చిందులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:29 AM
వైసీపీ నేతలు పోలీసులను, అధికారులను బెదిరించడం మానుకోవడం లేదు. అమలాపురం లోక్‌సభ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్..
నీతో ఊచలు లెక్కపెట్టిస్తా
అమలాపురం రూరల్ సీఐకి వైసీపీ నేత విశ్వరూప్ వార్నింగ్
అమలాపురం, జూలై 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు పోలీసులను, అధికారులను బెదిరించడం మానుకోవడం లేదు. అమలాపురం లోక్‌సభ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్.. తాజాగా ఓ పోలీసు అధికారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘రానున్నది వైసీపీ ప్రభుత్వమే.. నేను ఎక్కడున్నా నిన్ను మాత్రం వదలను. నీ అంతు చూస్తా.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా.. వీఆర్‌కు పంపిస్తా..’ అని హెచ్చరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశంలో.. అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంతకుమార్‌ను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ అల్లవరం మండలం అధ్యక్షుడు బాపూజీ కుమారుడిపై అకారణంగా కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేయడంతో పాటు కొత్తపేట సబ్‌జైలుకు రిమాండ్‌కు పంపించారని విశ్వరూప్ ఆరోపించారు. ‘‘ఈ ఐదేళ్ల కాలంలో మంత్రి కోసమో, ఎమ్మెల్యే కోసమో పనిచేసుకో.. కానీ అకారణంగా వైసీపీ కార్యకర్తలపై వేధింపులకు దిగి కేసులు పెడితే నీతో ఊచలు లెక్కపెట్టిస్తా..’’ అని హెచ్చరించారు. ఒక పక్షానికి అనుకూలంగా పనిచేసి తమ కార్యకర్తలను వేధింపులకు గురిచేయవద్దని, పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగే పరిస్థితులు తేవద్దని హితవు పలికారు. సీఐపై విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీ, ఇటు పోలీసు వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.