Local Demand: నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:37 AM
జిల్లాల పునర్వవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ స్థానికుల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ దిశగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు...
మాజీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
నరసాపురం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్వవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ స్థానికుల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ దిశగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో వైద్యులు, వ్యాపారులు, న్యాయవాదులు, విద్యా సంస్థల యజమానులు, వివిధ పార్టీల నాయకులు, కార్మికులు శనివారం తొలి అడుగు వేశారు. రాయపేటలోని ఆయన నివాసం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ నాయకర్‌ను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం, కమిటీ దృష్టికి తీసుకెళ్లి నరసాపురానికి న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందించారు. మాధవనాయుడు మాట్లాడుతూ భౌగోళికంగా అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం కారణంగా నరసాపురానికి అన్యాయం జరిగిందన్నారు. దీనికి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఓ కారణమని ఆరోపించారు. ‘జిల్లా ఉద్యమంలో నేను పాల్గొన్నా. ప్రజల మనోభావాలు నాకు తెలుసు. దీని కోసం నా వంతు కృషి చేస్తాన’ని నాయకర్ హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రం సాధనకు అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.