Share News

రూ.83,500 కోట్లతో రుణ ప్రణాళిక

ABN , Publish Date - May 14 , 2025 | 01:28 AM

ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో రూ.83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. మంగళవారం రుణ ప్రణాళికను విడుదల చేసింది. ముగిసిన 2024 - 25 ఆర్థిక సంవత్సరం కంటే రూ. 10,500 కోట్లు హెచ్చుగా రుణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. వ్యవసాయ రంగానికి రూ.13,500 కోట్లను కేటాయించింది.

రూ.83,500 కోట్లతో రుణ ప్రణాళిక

- గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ.10,500 కోట్లు అదనం

- ప్రాధాన్య రంగానికి రూ.33 వేల కోట్ల రుణ ప్రతిపాదనలు

- బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలి

- ఒక కుటుంబం - ఒక పారిశ్రామిక వేత్త సాధనలో కీలక భాగస్వాములు కావాలి

-వినియోగదారుడిని ఉత్పత్తిదారుడిగా చేసే పీఎం సూర్యఘర్‌పై విస్తృత అవగాహన కల్పించాలి

- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

విజయవాడ, మే 13 (ఆంధ్రజ్యోతి):

ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో రూ.83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. మంగళవారం రుణ ప్రణాళికను విడుదల చేసింది. ముగిసిన 2024 - 25 ఆర్థిక సంవత్సరం కంటే రూ. 10,500 కోట్లు హెచ్చుగా రుణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. వ్యవసాయ రంగానికి రూ.13,500 కోట్లను కేటాయించింది. వ్యవసాయ రంగంలో షార్ట్‌ టర్మ్‌ పంట రుణాలు రూ.11,500 కోట్లు, వ్యవసాయ టర్మ్‌ లోన్స్‌ (అగ్రి ఇన్ర్ఫా, అనుబంధ రంగాలు) రూ.5,000 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) రంగానికి సంబంధించి రూ.17,500 కోట్లు, ఇతర ప్రాధాన ్యతా రంగాలకు రూ.2,495 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ.33,000 కోట్లు, ప్రాధాన్యతేతర రంగాలకు రూ.50,500 కోట్లు చొప్పున కేటాయించటం జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా చరిత్రలో ఇది అతి పెద్ద వార్షిక రుణ ప్రణాళికగా నిలుస్తోంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను మించి సాధించటంతో ఈ సారి రికార్డు స్థాయిలో రూ. 83,500 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో షార్ట్‌ టర్మ్‌ పంట రుణాలు 82ు, వ్యవసాయ టర్మ్‌ లోన్స్‌ 134ు, వ్యవసాయ రుణాలు 102ు, ఎంఎస్‌ఎంఈ 110ు, ఇతర ప్రాధాన్యత రంగం 45ు, ప్రాధాన్యతరంగం 100ు, ప్రాధాన్యేతర రంగం 136ు శాతం మేర లక్ష్యాన్ని సాధించటం జరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 73,000 కోట్ల వార్షి రుణ ప్రణాళికను నిర్దేశించుకోగా... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.89,468 కోట్ల మేర సాధించటం జరిగింది. ఈ లెక్కన చూస్తే 123 శాతం మేర లక్ష్యాన్ని సాధించటం జరిగింది. దీంతో నూతన ఆర్థిక సంవత్సరం 2025 - 26 కు రూ. 83,500 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగింది. ఆచరణలో రూ.లక్ష కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ఈ మేరకు నిర్ణయించింది.

పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక(ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.13,500 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.17 వేల కోట్లు రుణాల సమపార్జన లక్ష్యంగా ప్రతిపాదించినట్లు తెలిపారు. వినియోగదారుడిని ఉత్పత్తి దారుడిగా మార్చి, పర్యావరణ హిత, ఆర్థిక వృద్ధి సాధించే విధంగా పీఎం సూర్యఘర్‌ పథకంపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి వివరించారు. లబ్ధిదారులకు నిర్దేశించుకున్న లక్ష్యాలకనుగుణంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కోరుకున్న ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని చేరాలంటే బ్యాంకులు మద్దతు చాలా అవసరమని వివరించారు.

వినూత్న ఆలోచనలతో ముందుకు

వికసిత భారత- 2047, స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలు నెరవేరాలంటే బ్యాంకుల భాగస్వామ్యం ముఖ్యమని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాలో వినూత్న ఆలోచనలతో ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కింద పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు బ్యాంకులు లబ్ధిదారులకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఇప్పుడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ స్ఫూర్తితో త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. వందశాతం లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రైతులకు రుణాలు మంజూరు చేయాలని వివరించారు. నాబార్డ్‌ జిల్లా ప్రాధాన్యత రంగానికి సంబంధించి రూ.30 వేల కోట్లతో పొటన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌(పీఎల్‌పీ)ను కూడా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీసీసీ కన్వీనర్‌, యూబీఐ రీజనల్‌ హెడ్‌ ఎంవీ తిలక్‌, ఆర్‌బీఐ ఎల్‌డీవో సీహెచ్‌ నవీన్‌ కుమార్‌, నాబార్డు డీడీఎం మిలింద్‌ చౌసాల్కర్‌, ఎల్‌డీఎం కె.ప్రియాంక, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి, టిడ్కో ఈఈ చిన్నోడు, డీఆర్‌డీఏ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.కిరణ్‌కుమార్‌, ఆర్‌సేతి డైరెక్టర్‌ అమరేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 01:28 AM