AP Police: లోన్ యాప్ బాధితులకు 48 లక్షలు రికవరీ
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:34 AM
సైబర్ నేరగాళ్ల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతుండగా... విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రాష్ట్రంలోనే మొదటిసారిగా సీజ్ చేసిన క్రిప్టో కరెన్సీని మన రూపాయల్లోకి...
వంద మంది బ్యాంకు ఖాతాల్లో జమ
క్రిప్టో కరెన్సీ రూపాయల్లోకి మార్పు
రాష్ట్రంలో తొలిసారి విశాఖ పోలీసుల కృషి
విశాఖపట్నం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతుండగా... విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రాష్ట్రంలోనే మొదటిసారిగా సీజ్ చేసిన క్రిప్టో కరెన్సీని మన రూపాయల్లోకి మార్చి బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేశారు. వంద మంది బ్యాంకు ఖాతాల్లో రూ.48 లక్షలు జమ చేశారు. సైబర్ క్రైమ్ గణాంకాల ప్రకారం విశాఖ నగరంలో 295 మంది లోన్‌యాప్ బాధితులు ఉండగా.. సుమారు వంద మంది అధిక మొత్తంలో నష్టపోయారని గుర్తించామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇన్‌స్టంట్ లోన్‌యాప్‌లో సీజ్ అయిన క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చి, న్యాయపరమైన చర్యలు తీసుకుని బాధితుల ఖాతాల్లో రూ.48 లక్షలు జమ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్‌కు ఆశ పడి బ్యాంకు ఖాతా ప్రారంభించినా, అకౌంట్లు బదిలీ చేసినా, బ్యాంకు అధికారులు సరిగ్గా పరిశీలించకుండా కరెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం రిపోర్టింగ్ పోర్టల్ సైబర్‌క్రైమ్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబరు 1930 లేదా కమిషనర్ 7995095799 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు పొగొట్టుకుంటే గోల్డెన్ అవర్ (గంటలోపు)లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేసుకోవచ్చన్నారు. జాప్యం చేస్తే ఆ డబ్బు మూల్ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని, తర్వాత వివిధ దేశాలకు క్రిప్టో కరెన్సీగా వెళ్లిపోతుందని, దానిని వెనక్కి తీసుకురావడం కష్టంగా మారుతుందని అన్నారు.