సమస్యలతో సహజీవనం
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:23 AM
కృష్ణాజిల్లా వణుకూరు జగనన్న కాలనీలో కనీస వసతులు కరువై సమస్యలతో స్థానికులు సహజీవనం చేస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అలమటించిపోతున్నారు. బురదతో నిండిన రోడ్లపై రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. వాడుకున్న నీరు బయటకు పోయే దారి లేక అక్కడే రోజుల తరబడి నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రుళ్లు బయటకు రావడానికి జంకుతున్నారు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదల కష్టాలను ఇటు ఎన్టీఆర్ జిల్లా అధికారులు, అటు కృష్ణాజిల్లా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
-కృష్ణాజిల్లా వణుకూరు జగనన్న కాలనీలో దుస్థితి
-విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5,440 మందికి ఇళ్ల స్థలాల కేటాయింపు
-పూర్తయిన 1400 గృహాలు.. నిర్మాణ దశలో మరో 1300 ఇళ్లు
-పట్టాలు ఇచ్చి కనీస వసతులు మరచిన గత వైసీపీ ప్రభుత్వం
-తాగు నీరు, రోడ్లు, డ్రెయిన్లు, కరెంటు సమస్యలతో స్థానికులు సతమతం
-పట్టించుకోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు
కృష్ణాజిల్లా వణుకూరు జగనన్న కాలనీలో కనీస వసతులు కరువై సమస్యలతో స్థానికులు సహజీవనం చేస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అలమటించిపోతున్నారు. బురదతో నిండిన రోడ్లపై రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. వాడుకున్న నీరు బయటకు పోయే దారి లేక అక్కడే రోజుల తరబడి నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రుళ్లు బయటకు రావడానికి జంకుతున్నారు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదల కష్టాలను ఇటు ఎన్టీఆర్ జిల్లా అధికారులు, అటు కృష్ణాజిల్లా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ):
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5,440 మంది పేదలకు కృష్ణాజిల్లా వణుకూరు జగనన్న కాలనీ (వీఎంసీ లేఅవుట్)లో ఒక్కొక్కరికి సెంటు చొప్పున గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇప్పటి వరకు 1,400 గృహాలు పూర్తవగా, మరో 1,300 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన ఇళ్లలో 100పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ మౌలిక వసతులను గత వైసీపీ ప్రభుత్వం కల్పించకుండా వదిలేసింది. దీంతో తాగు నీరు, రోడ్లు, డ్రెయిన్ల సమస్యలతో సతమతం అవుతున్నారు.
కన్నెత్తిచూడని రెండు జిల్లాల అధికారులు
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చే నాటికి జిల్లాల విభజన జరగలేదు. తర్వాత ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలుగా ఏర్పడింది. అయితే ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ జిల్లా వాసులుగా రికార్డులో ఉండగా, వారికి కృష్ణాజిల్లా వణుకూరులో ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు ఉంది. దీంతో రెండు జిల్లాల అధికారులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతకాలం హౌసింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ లేఅవుట్ ఉండగా, ఇప్పుడు వారు కూడా ముఖం చాటేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ లేఅవుట్‌ను వీఎంసీ అధికారులు తమకు అధికారికంగా అప్పగించలేదని వణుకూరు పంచాయతీ అధికారులు తప్పించుకుంటున్నారు. వీఎంసీ కమిషనర్‌గా ధ్యానచంద్ర బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లే అవుట్ వైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రెండు జిల్లాల కలెక్టర్లు ఇప్పటి వరకు రాలేదని ఆరోపణ కూడా ఉంది.
నీరు లేక కన్నీళ్లు
కాలనీలో నీటి వసతి కోసం పైపులైన్లు, ట్యాంకులు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా బోరు వేసుకుంటేనే నీరు. వాతావరణం అనుకూలించక విద్యుత సరఫరా నిలిచిపోతే ఇక అంతే సంగతి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకరోజంతా కరెంటు లేకపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు.
మట్టి రోడ్లే దిక్కు
కాలనీలో ప్రధాన రహదారితో పాటు వీధుల్లో మట్టిరోడ్లు వేశారు. ప్రస్తుతం ఈ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాకాలం బురదతో నిండిపోయి అడుగుతీసి అడుగు వేయడానికి స్థానికులు భయపడుతున్నారు. దీనికి తోడు కాలనీలో భారీ వాహనాలు వెళ్తుండటంతో రోడ్లు గోతులమయం అయ్యాయి. చినుకు పడితే వాహనాలు జారిపోయేలా ఉన్నాయి. మద్దూరు- గోసాల ప్రధాన రోడ్డు రాళ్లు తేలి అధ్వానంగా తయారైంది.
కరెంట్ కష్టాలు
లే అవుట్‌లో వీధి దీపాలు అక్కడక్కడ కనిపిస్తాయి. వాటిలో ఎన్ని వెలుగుతాయో చెప్పలేని పరిస్థితి. పాముల సంచారం ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కాలనీలో కొన్ని చోట్ల కరెంటు లైన్లు ఉన్నా వాటికి విద్యుత సరఫరా ఇవ్వలేదు.
ఎక్కడి మురుగు అక్కడే..
కాలనీ రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోతోంది. రోజుల తరబడి నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దోమలకు అవాసంగా మారుతోంది. వీటికి తోడు పిచ్చి మొక్కలతో ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది.
బస్సు కోసం పరుగులు
మద్దూరు వరకు 121 ఎం బస్ సర్వీస్ నడుస్తోంది. ఈ కాలనీ వాసులకు ఈ బస్సే ఆధారం. ప్రయాణికులు ఉన్నచోట బస్సు ఆపకుండా ఎక్కడో ఆపుతున్నారని, అక్కడకు పరుగులు తీయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చోట స్థిరమైన ప్రదేశంలో బస్సు ఆపేలా, అక్కడ బెంచీలు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గంజాయి బ్యాచ్ సంచారం
వణుకూరు, మద్దూరు మధ్య పోలీస్ బీట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వణుకూరు దాటితే నిర్మానుష్యంగా ఉంటుంది. ఖాళీ ప్రదేశం, వీధి దీపాలు లేకపోవడంతో గంజాయి బ్యాచ్‌లు, మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఇటువైపు తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించుకుని వచ్చే వారికి వీరి వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు.
హౌస్ హోల్ మ్యాపింగ్ కూడా లేదు
ఈ కాలనీలో నివసిస్తున్న వారంతా తూర్పు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఇక్కడ ఉన్న వారందరికీ విజయవాడలోని సచివాలయాల్లో మ్యాపింగ్ అయినట్లు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వణుకూరు సచివాలయంలో మ్యాపింగ్ చేయించుకోవాలని అధికారులు చెప్పగా, అక్కడకు వెళితే ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రెండు జిల్లాల అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.