Konaseema District: అలరించిన చిన్నారుల.. గణనాథులు
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:10 AM
గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ ఎడ్లబండి. దానిపై ఠీవిగా కొలువుదీరిన వినాయకుడు. ఆ వెనుక 31 చక్రాలతో పొడవైన ట్రాలీ.. దానిపై చిన్ని చిన్న గణనాథులు. ఆ ఎడ్లబండినీ..
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ ఎడ్లబండి. దానిపై ఠీవిగా కొలువుదీరిన వినాయకుడు. ఆ వెనుక 31 చక్రాలతో పొడవైన ట్రాలీ.. దానిపై చిన్ని చిన్న గణనాథులు. ఆ ఎడ్లబండినీ.. ట్రాలీని లాక్కుంటూ.. నిమజ్జనానికి తీసుకెళుతున్న చిన్నారులు. ...ఇదీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు చాకలిపాలెంలో శనివారం కనిపించిన దృశ్యం. స్థానిక న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ కుటుంబం గత పదిహేనేళ్లుగా ఏటా వినాయక చవితి రోజున గణనాథులతో కూడిన బొమ్మలకొలువు ఏర్పాటుచేసి, చివరిరోజు ఊరేగింపుగా తీసుకెళ్లి.. నిమజ్జనం చేస్తోంది. ఈ శనివారం కూడా గణనాథులకు ప్రత్యేక పూజలు చేసి, పుర వీధుల్లో ఊరేగించి, రాజోలు మండలం సోంపల్లిలో నిమజ్జనం చేశారు. రాజోలులో జరిగే ఓ కార్యక్రమానికి అటుగా వెళుతున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఈ గణనాధుల ఊరేగింపును చూసి, కారు దిగి ఆసక్తిగా తిలకించారు. స్థానికులతో కలిసి కాసేపు ఆ ట్రాలీని లాగారు.
- పి.గన్నవరం, ఆంధ్రజ్యోతి