Share News

MLA Palle Sindhura Reddy: ఇది అక్షర విజయం

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:18 AM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ చేపట్టిన అక్షరం అండగా.. వినూత్న కార్యక్రమం చక్కటి ఫలితాలు ఇచ్చిందని, ఇది అక్షర విజయమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కొనియాడారు.

MLA Palle Sindhura Reddy: ఇది అక్షర విజయం

  • ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం వినూత్నం

  • ప్రజల సమస్యలు మాకు తెలిశాయి.. పరిష్కారం చూపించగలిగాం

  • ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ను అభినందించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి

  • 7నెలల్లో రూ.5.86కోట్ల కేటాయింపు.. 99ు సమస్యల పరిష్కారం

  • శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో ‘అక్షరం అండగా..’ సభ

పుట్టపర్తి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ చేపట్టిన ‘అక్షరం అండగా..’ వినూత్న కార్యక్రమం చక్కటి ఫలితాలు ఇచ్చిందని, ఇది అక్షర విజయమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కొనియాడారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో మంగళవారం నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సభలో ఆమె ప్రసంగించారు. ఈ ఏడాది జనవరి 28న నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు ప్రస్తావించిన సమస్యల్లో 99శాతం పరిష్కరించామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం రూ.5.86 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. తొలిదశలో రూ.4.68 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలినవి కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణంపై జూలై 10న కొత్తచెరువులో జరిగిన మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, తక్షణం ఆయన రూ.2 కోట్లు మంజూరు చేశానని వివరించారు. పెనుకొండ రహదారిలో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న దృష్టికి తీసుకెళ్లి, రూ.2కోట్లు మంజూరు చేయించానని ఎమ్మెల్యే తెలిపారు.


కొత్తచెరువులో ఎన్నో ఏళ్లగా ఉన్న శ్మశానవాటిక సమస్యకు పరిష్కారం చూపించామని, 3.70 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీకి అప్పగించారని వెల్లడించారు. 1,150 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయించామని, రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని, తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయించామని, విద్యుత్తు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించామని వివరించారు. ఈ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం చొరవ అభినందనీయమ న్నారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టి తీసుకువచ్చి పరిష్కారం మార్గం చూపాలన్న ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ తపన అభినందనీయమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యాయంటూ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’కు ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 03 , 2025 | 06:21 AM