SIT Investigation: సైబర్ దొంగల్లా లిక్కర్ ముఠా
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:44 AM
గత జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన ముడుపులను రకరకాల మార్గాల్లో మళ్లించిన మాఫియా..
ముడుపుల సొమ్ము 77 కోట్లు వైట్‌మనీగా మార్పు
కసిరెడ్డి డైరెక్షన్‌లో మొదట 4 డొల్ల కంపెనీల్లోకి బదిలీ
అక్కడి నుంచి 32 ఖాతాల్లోకి మళ్లింపు
ఆ తర్వాత వైట్‌మనీగా విత్ డ్రా
గత ప్రభుత్వ పెద్దలకు అందజేసిన అనిల్ చోఖ్రా
ముంబైలో ఆర్థిక మోసాలు, ఈడీ కేసుల్లో నిందితుడు
ఏ-49 రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి
21 వరకు రిమాండ్.. విజయవాడ జిల్లా జైలుకు
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన ముడుపులను రకరకాల మార్గాల్లో మళ్లించిన మాఫియా.. కమీషన్లలో కొంత సొమ్మును వైట్‌మనీగా మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్ల తరహాలో ఎత్తుగడ వేసింది. ఇందుకు ముంబైకి చెందిన ఆర్థిక మోసాల నిందితుడు అనిల్ చోఖ్రా సహకరించినట్టు తాజాగా వెల్లడైంది. ప్రతి నెలా రాష్ట్రంలో 60 కోట్లకు పైగా కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు ఆ సొమ్మును మొదట మ్యూల్ ఖాతాలకు బదిలీ చేయడం, తర్వాత వీలైనన్ని ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేయడం, బాధితులు ఫిర్యాదు చేసి పోలీసులు గుర్తించే లోపే ఆ ఖాతాల లావాదేవీలను పూర్తిగా ఆపేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో మనీ రూటింగ్ అచ్చం ఇలానే జరిగింది. మద్యం ముడుపుల్లో 77.55 కోట్లను మళ్లించి వైట్‌మనీగా మార్చుకున్నారు. మద్యం వ్యాపారుల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్లు వసూలు చేసిన లిక్కర్ సిండికేట్.. అందులో పలు దఫాలు కోట్లాది రూపాయలను వైట్‌మనీగా మార్చుకోవడానికి నాలుగు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేసింది. ఆ తర్వాత అడ్ర్‌సలేని 32 ఖాతాల్లోకి బదిలీ చేసి వైట్‌మనీగా విత్ డ్రా చేసుకుంది. గత ప్రభుత్వ పెద్దలకు ఆ డబ్బులు చేర్చిన తర్వాత ఆ ఖాతాల్లో లావాదేవీలు ఆగిపోయాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ఐదు నెలల పాటు లాగిన తీగతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి(ఏ-1)తో వ్యవహారం నడిపిన ముంబై వాసి అనిల్ చోఖ్రా (ఏ-49)ను సిట్ అధికారులు అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో ముడుపుల బదిలీ వ్యవహారాన్ని పేర్కొన్నారు.
చోఖ్రా సిమ్‌లు.. అన్నీ ఆఫ్‌లోనే
మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసిన రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ పదుల సంఖ్యలో సిమ్ కార్డులు వాడింది. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆ సిమ్ కార్టులన్నీ పడేసింది. ముంబైకి చెందిన దళారీ అనిల్ చోఖ్రా కూడా పదుల సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగించాడు. డొల్ల కంపెనీలకు ఇచ్చిన నంబర్లన్నీ చోఖ్రా కు సంబంధించినవేనని సిట్ గుర్తించింది. 2015లో కనికా జెమ్స్ పేరిట ఓ బ్యాంకు నుంచి రూ.304 కోట్లు రుణం పొందిన కేసులో ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు 2013లో రూ.24 కోట్ల జీఎస్టీ మోసం కేసులో, 2016లో మరో ఆర్థిక నేరంలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు చోఖ్రాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి కొత్తకొత్త సిమ్‌లు వాడుతూ పని పూర్తికాగానే వాటిని పడేసి జాగ్రత్తలు తీసుకునేవాడు. ఏపీ మద్యం ముడుపుల సొమ్మును వైట్‌మనీగా మార్చిన తర్వాత ఆ వ్యవహారానికి సంబంధించి వాడిన సిమ్‌కార్డులన్నీ ఆగిపోయాయి. సిట్ దర్యాప్తులో లభించిన రూ.221 కోట్లకు సంబంధించిన పలు వ్యాపార ఇన్వాయి్‌సలపై ఉన్న నంబర్లు ఏవీ ఇప్పుడు మనుగడలో లేవని అధికారులు గుర్తించారు. నకిలీ ఇన్వాయి్‌సలు, ఈ-వే బిల్లుల్లో పేర్కొన్న దుస్తులు ఇతరత్రా గూడ్స్ రవాణా అయినట్లు రికార్డుల్లో లేదు. టోల్ గేట్లలోనూ ఆయా వాహనాలు దాటి వెళ్లినట్లు సీసీ ఫుటేజీ రికార్డులు లేవు.
చిరునామా లేని వ్యాపారాలు
లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు డిస్టిలరీల యజమానుల్ని మొదట్లో ప్రశ్నించారు. ముడుపుల సొమ్ము హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లిక్కర్ మాఫియాకు నగదు రూపంలో ఇవ్వడంతో పాటు ముంబైలోని బులియన్ ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఆరా తీయగా నాలుగు డొల్ల ఖాతాల్లోకి అదానీ, ఎస్పీవై, లీలా డిస్టిలరీల నుంచి రూ.77.55 కోట్లు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. లోతుగా విచారించగా అనిల్ చోఖ్రా పాత్ర బయటపడింది. ముంబైలో మనీ లాండరింగ్ చేసే చోఖ్రా ఏపీ మద్యం ముడుపుల్ని వైట్‌మనీగా మార్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. అందుకు ఉపయోగించిన 32 వ్యాపార అడ్ర్‌సలు వెతుక్కొని వెళ్లిన సిట్ అధికారులు 25 చిరునామాల్ని గుర్తించారు. ఆ అడ్ర్‌సలలో అటువంటి కంపెనీల్లేవని, అలాంటి పేర్లు కూడా ఎన్నడూ వినలేదని ఆ భవనాల యజమానులు చెప్పారు. ఈ కంపెనీల సృష్టి, బ్యాంకుల్లో ఖాతాలన్నీ నల్లధనం మార్పిడి కోసమేనని సిట్‌కు పూర్తి స్పష్టత వచ్చింది.
రాజ్ కసిరెడ్డి స్కెచ్
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేసేందుకు అప్పటి సీఎం జగన్‌కు ఐటీ సలహాదారుగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(రాజ్ కసిరెడ్డి) పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. ముడుపుల సొమ్మును వివిధ మార్గాల్లో వైట్‌మనీగా మార్చేందుకు ముంబైకి చెందిన దళారీ అనిల్ చోఖ్రాను సంప్రదించాడు. అప్పటికే రెండు ఆర్థిక నేరాల కేసుల్లో చోఖ్రా నిందితుడు. మరో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపగా బెయిలుపై బయట ఉన్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో పేదలు, నిరక్షరాస్యుల ఆధార్, పాన్‌కార్డులు తీసుకుని షెల్ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేయడంలో అనిల్ చోఖ్రా సిద్ధహస్తుడు. అనిల్ చోఖ్రాతో రాజ్ కసిరెడ్డి చేసుకున్న ఒప్పందం ప్రకారం.. మూడు డిస్టిలరీల నుంచి కోట్లాది రూపాయల సొమ్మును అనిల్ చెప్పిన నాలుగు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక జే బ్రాండ్ లిక్కర్ సరఫరా చేసిన రాజ్ కసిరెడ్డి బినామీ కంపెనీలైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి రూ.18.20 కోట్లు, ఎస్‌పీవై ఆగ్రో డిస్టిలరీస్ నుంచి రూ.39 కోట్లు, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి రూ.20.28 కోట్లు.. పలు దఫాల్లో మొత్తం రూ.77.55 కోట్లు చోఖ్రా సూచించిన నాలుగు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపటి ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్‌నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ ప్రైజెస్ ఖాతాల్లోకి చేర్చారు. ఆ మొత్తాన్ని పలు దఫాలుగా 32 అడ్రస్ లేని వ్యాపారాల ఖాతాల్లోకి మళ్లించారు. మొత్తం నగదు రూపంలో విత్ డ్రా చేసిన కోట్లాది రూపాయల నగదును గత ప్రభుత్వంలోని పెద్దలకు చేర్చిన తర్వాత బ్యాంకు అకౌంట్లు మూసేశారు.
21 వరకు చోఖ్రాకు రిమాండ్
విజయవాడ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ-49 నిందితుడు అనిల్ చోఖ్రాకు ఈ నెల 21 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అతడిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. చోఖ్రాను ముంబైలో సిట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని ముందుగా అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.