Liquor Scam: కట్టల గుట్టలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:38 AM
జగన్ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ముడుపుల వసూళ్ల నుంచి పంపిణీ వరకూ పక్కా పథకం ప్రకారం చేశారు. మద్యం డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేశాక పెద్దలకు చేరవేసేవారు...
లిక్కర్ స్కామ్‌లో వీడియోలు రికవరీ!
డెన్‌లలో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు
టెక్నాలజీ సాయంతో ఎఫ్‌ఎస్ఎల్ వెలికితీత
నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు
వాటిని ‘పెద్దల’కు పంపిన నిందితులు
సెల్‌ఫోన్లలో డిలీట్ చేసినా ‘డేటా రిట్రీవల్’
కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు
17న కోర్టుకు చార్జిషీట్ సమర్పించనున్న సిట్
గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కీలక ఆధారాలు కనుగొన్నారు. అధునాతన టెక్నాలజీ సాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించిన వీడియోలను సేకరించారు. డెన్‌లలో దాచిన డబ్బుల వివరాలు అప్పటి ప్రభుత్వ, అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల నుంచి ఈ వీడియోలను బయటికి తీశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందుజాగ్రత్తగా తమ సెల్‌ఫోన్ల నుంచి ఆ వీడియోలను డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్)కి పంపి డిలీట్ చేసిన వీడియోలను వెలికి తీయించారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ముడుపుల వసూళ్ల నుంచి పంపిణీ వరకూ పక్కా పథకం ప్రకారం చేశారు. మద్యం డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేశాక ‘పెద్దల’కు చేరవేసేవారు.ఇదంతా లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి డైరెక్షన్‌లో జరిగింది. నిందితులు లిక్కర్ సొమ్ము పంపిణీకి ముందు వీడియోలు తీశారు.డెన్‌లలో దాచిన డబ్బుల వివరాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.ఈ వీడియోలను సంబంధిత వ్యక్తులకు పంపారు.ఎన్నికల తర్వాత ఊహించని ఫలితం రావడంతో అప్రమత్తమైన రాజ్ కసిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్ల నెట్ వర్క్‌లోని ప్రతి వ్యక్తినీ హైదరాబాద్‌కు పిలిపించి వారి సెల్‌ఫోన్లు తీసుకున్నాడు.
ప్రతి ఫోన్‌కూ కనీసం లక్ష రూపాయలకు తగ్గకుండా వారికి ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకోవాలని సూచించాడు.ఇక లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లను డిపోల్లో ధ్వంసం చేశారు.ఇలా సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో ఒక చోట దొరుకుతాడు అన్నట్టు..లిక్కర్ స్కామ్ నిందితులు ఆధారాలు లభించకుండా ధ్వంసం చేసినా తప్పించుకోలేకపోయారు.సిట్ బృందంలో టెక్నాలజీపై బాగా పట్టున్న అధికారులు రికవరీకి మార్గం వెతికారు.కసిరెడ్డి టీమ్ నుంచి సెల్‌ఫోన్లు దొరక్కపోయినా, వారు వీడియోలు పంపిన కొందరు నిందితుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.వారు కూడా ఆ వీడియోలను డిలీట్ చేసేశారు. అయితే అధికారులు ఏపీఎఫ్‌ఎస్ఎల్ వద్ద ఎలాంటి రిట్రీవల్ పరికరాలు ఉన్నాయో తెలుసుకుని.. ‘డిలీట్ డేటా రిట్రీవల్’ కోసం తాము స్వాధీనం చేసుకున్న నిందితుల ఫోన్లు పంపారు.దీంతో ఎన్నో రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియోలతో పాటు చాటింగ్‌లు, సందేశాలు,ఫొటోలు సైతం బయట పడ్డాయి. అధికారులు రెండు కీలక వీడియోలు చూసి ఆశ్చర్యపోయారు. రెండు వేలు, ఐదు వందల నోట్ల కట్టలతో కూడిన డెన్‌లు చూసి.. ‘సినిమాల్లోనే ఇలాంటి దృశ్యాలు చూశాం’ అంటూ విస్తుపోయారు.సిట్ అధికారులు త్వరలో దాఖలు చేయనున్న చార్జిషీట్‌లో ఈ ఆధారాలను పొందపరచనున్నారు.అవన్నీ బయటకు వస్తే సంచలనాలు జరిగే అవకాశముంది.
వీడియోల్లో ఏముందంటే...
ఓ వీడియోలో నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి నోట్ల కట్టల మధ్యలో నిల్చున్నాడు. ‘ఈ ఐదు కోట్లు అక్కడికి.. ఈ ఏడు కోట్లు ఇక్కడికి.. ఆ రెండు వేల నోట్ల కట్టల బాక్సు ఫలానా చోటుకు.. ఈ ఐదొందల బండిల్స్ బ్యాగు ఆ కార్లోకి..’ అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తులకు చెప్పాడు. రాయలసీమలో వైసీపీలో కీలక నాయకుల్లో ఒకరికి ఆ వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ డబ్బు ఎవరెవరికి చేర్చాడు? అలా ఎన్నిసార్లు తరలించాడు? ఆ సమయంలో అక్కడున్న వ్యక్తులెవరు? అనే విషయాలపై కూపీ లాగినట్టు తెలుస్తోంది.
మరో వీడియోలో వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. అయితే పుస్తకాల షాపులో బుక్కులు పేర్చినట్లు భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఒక కీలక నిందితుడి సెల్‌ఫోన్ నుంచి ఈ వీడియోను రిట్రీవల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 17న చార్జిషీట్
మద్యం కుంభకోణంలో ఏడు దశల్లో ప్రణాళికా బద్ధంగా దోపిడీ జరిగింది. సిట్ ఇప్పటి వరకూ 40 మందిని నిందితులుగా చేర్చింది. రాజ్ కసిరెడ్దితో పాటు మాజీ సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేసింది. సాక్షులు, అనుమానితులను 200మందికి పైగా విచారించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న పది మందికి పైగా విదేశాలకు పారిపోయారు. ఈ కేసు విచారణలో మూడు నెలలకు పైగా సిట్ సేకరించిన ఆధారాలు ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరనున్నాయి. మద్యం ముడుపుల వసూళ్లు, డెన్‌లలో దాచడం, కీలక వ్యక్తులకు పంపడం, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేయడం, కీలక వ్యక్తుల పాత్ర, బినామీల ఆస్తులు, హవాలా మార్గంలో విదేశాలకు తరలించడం తదితర విషయాలపై చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు. పది రోజులకు పైగా ఇదే పనిలో నిమగ్నమైన సిట్ అధికారులు న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు అనే దానిపై పక్కా ఆధారాలతో పాటు టెక్నికల్ సాక్ష్యాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకుల పాత్రపై కూడా ఇప్పటి వరకూ లభించిన ఆధారాలు సమర్పించబోతున్నట్లు తెలిసింది. ఈ నెల 21 నాటికి రిమాండ్ ఖైదీగా రాజ్ కసిరెడ్డికి 90 రోజులు పూర్తి అవుతుంది. ఈ లోపు చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. దీంతో అభియోగ పత్రాన్ని సిద్ధం చేసిన సిట్.. సోమవారం నాటికి ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురానుంది. మంగళవారం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపి మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి గురువారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.