YCP Liquor Corruption: పక్కా వ్యూహంతో స్కాం
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:58 AM
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం పక్కా వ్యూహం ప్రకారం సాగింది. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడం, బోగస్ కంపెనీలను సృష్టించి డబ్బు దారి మళ్లించడం...
డిస్టిలరీల నుంచి ముడుపులు.. బోగస్ కంపెనీలతో దారి మళ్లింపు
షెల్ కంపెనీలను సృష్టించి డబ్బును వైట్‌గా మార్చిన వైనం
ఎప్పటికప్పుడు వాటాల పంపిణీ.. ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం పక్కా వ్యూహం ప్రకారం సాగింది. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడం, బోగస్ కంపెనీలను సృష్టించి డబ్బు దారి మళ్లించడం, షెల్ కంపెనీల ద్వారా బ్లాక్‌మనీని వైట్‌గా మార్చడం.. వసూలు చేసిన మద్యం ముడుపులను వాటాలు పంచుకోవడం, నెలనెలా ‘పెద్దల’కు చేర్చడం, ఎన్నికల ఖర్చు కోసం కొంత వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడం.. అంతా ఓ పథకం ప్రకారం జరిగింది. మద్యం స్కామ్‌లో ముడుపుల బాగోతాన్ని సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లో క్షుణ్నంగా వివరించింది. విశ్వసనీయం సమాచారం మేరకు...
ముడుపులు ఎలా వచ్చాయంటే...
లిక్కర్ బ్రాండ్ బేసిక్ ధరపై బాక్స్‌కు రూ.150 నుంచి 600 వరకు కమీషన్ నిర్ణయించారు. ఇలా 3,500 కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేశారు.
బీఆర్‌కే స్పిరిట్స్ అనే లిక్కర్ సరఫరా సంస్థను 2013లో శైలేందర్ సింగ్ బగ్గా, మన్‌మీత్ సింగ్ బగ్గా ప్రారంభించారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏపీఎస్‌బీసీఎల్‌కు రూ.902 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసింది. అందులో రూ.148 కోట్లు కమీషన్ల రూపంలో మద్యం మాఫియాకు తిరిగి చెల్లించింది.
జీఎస్‌బీ అండ్ కో ఎల్‌ఎల్‌పీ అనే సంస్థను 2016లో శైలేందర్ సింగ్ బగ్గా, గురుచరణ్ సింగ్ బగ్గా ప్రారంభించారు. వైసీపీ హయాంలో 269 కోట్ల రూపాయల మద్యం సరఫరా చేయగా, ముడుపుల రూపంలో 39 కోట్లు మాఫియాకు ముట్టజెప్పారు.
విశాఖపట్నం జిల్లా కసింకోటలో ఉన్న బీ9 బేవరేజెస్ 2019-24 మధ్య బిరా91 పేరుతో భారీగా బీర్లు సరఫరా చేసింది. అందుకుగానూ 43 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించింది. ప్యాకేజింగ్, రా మెటీరియల్స్, ప్రమోషన్ లాంటి సేవల కోసం షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఆ సొమ్మును కొన్ని రోజుల్లోనే విత్ డ్రా చేసి గుండం కృష్ణారెడ్డికి అందజేశారు. సిండికేట్ అనుమతితో కృష్ణారెడ్డి ఆ మొత్తాన్ని తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో 302 ఫ్లాట్‌లో ఉన్న ప్రణయ్ ప్రకాశ్‌కు అందజేశాడు. ఈ విషయాన్ని ఇద్దరూ సిట్ విచారణలో అంగీకరించి వాంగ్మూలం ఇచ్చారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఇన్న ట్రోపికల్ ఇన్ బేవ్ అనే ఫర్మ్ 2021-23 మధ్యలో రూ.89 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేసింది. అందుకుగానూ ముడుపుల రూపంలో 16 కోట్లు ఏడు ఇతర వ్యాపార బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించింది. ఆ బ్లాక్ మనీ వైట్‌గా మారి రూ.14.65 కోట్లు లిక్కర్ మాఫియాకు చేరింది.
కారియానో టెలీకామ్ కంపెనీ సహా 12 సంస్థల నుంచి రూ.127.03 కోట్లు అక్రమంగా వివిధ షెల్ కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సిట్ గుర్తించింది. అందులో ఓం సాయి మొబైల్స్, ఫెరారీ వీడియో, వైష్ణో టెలీకామ్, పసిఫిక్ ఎలక్ట్రానిక్స్, ఐకాన్ టెక్నాలజీ ఇండియా, సన్ అండ్ ఇండియా తదితర ఖాతాల్లోకి లావాదేవీలు జరిగాయి.
ముడుపుల్లో వాటాలు
ముడుపుల వసూలులో కీలకంగా వ్యవహరించిన ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఎప్పటికప్పుడు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డిలకు అందజేశాడు. ఎవరెవరికి ఎంత శాతమో తీసుకోగా.. అక్కడి నుంచి అంతిమలబ్ధిదారు జగన్‌కు చేరాల్సిన వాటా చేరింది.
రాజ్ కసిరెడ్డి కొంత సొమ్మును వ్యాపారాలు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సినిమా(స్పై) నిర్మించి పాతిక కోట్ల రూపాయలు నల్లధనం ఖర్చు చేశాడు. దుబాయ్‌లో విలాసంగా గడపడం నుంచి తన కంపెనీల్లో ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించాడు. లిక్కర్ సొమ్ముతో లగ్జరీ కార్లు, భూముల కొనుగోలు చేశాడు. ఈ కుంభకోణానికి సంబంధించి బ్యాంకు స్టేట్‌మెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఎలకా్ట్రనిక్ ఎవిడెన్స్‌లు చార్జిషీట్‌తో పొందుపరిచినట్లు సిట్ పేర్కొంది.
ఎన్నికల ఖర్చుకు ముడుపులు
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లిక్కర్ ముడుపులు ఖర్చు పెట్టారు. అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని లాంసమ్ ఎటానియా, కృషి వ్యాలీ అపార్ట్‌మెంట్, తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లలో బాక్సుల్లో సిద్ధంగా ప్యాక్ చేసి ఉంచిన 250 కోట్ల రూపాయలను వైసీపీ అభ్యర్థులకు అందజేశారు.
ఫోన్లు లాక్కుని దుబాయ్‌కు..
ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో లిక్కర్ మాఫియా ముందు జాగ్రత్త పడింది. ముడుపుల వ్యవహారాలు చూసిన పలువురి ఫోన్లు లాక్కొని దుబాయ్‌కి పంపించింది. జూబ్లీహిల్స్‌లోని రాజ్ కసిరెడ్డి ఆఫీసుకు వారిని పిలిపించి పైలా దిలీప్ (ఏ-30) ఫోన్లు తీసుకుని, వాటి ధరకు రెట్టింపు నగదు చెల్లించాడు. ఆ తర్వాత బూనేటి చాణక్య సూచన మేరకు దుబాయ్ చేరుకుని, అక్కడి బిజినెస్ బేలోని దమాక్ అపార్ట్‌మెంట్‌లో వరుణ్ తదితరులు ఉన్నారు.
దోపిడీకి అధికారుల సహకారం
మద్యం ముఠా దోపిడీకి ఏపీఎ్‌సబీసీఎల్ అధికారులు పూర్తిగా సహకరించారు. ప్రతి నెలా తన వాటా కోసం కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాసుదేవ రెడ్డి, ఐఏఎస్ హోదా ఇప్పిస్తారన్న ఆశతో సత్యప్రసాద్ తోడ్పాటు అందించారు. డిస్టిలరీ యజమానులు, మేనేజర్లతో పాటు ప్రొక్యూర్మెంట్ అధికారులను బ్లాక్ లిస్ట్ చేస్తామని బెదిరించి దారికి తెచ్చుకున్నారు.
త్వరలో మరో చార్జిషీట్
‘ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిన ఈ కుంభకోణంలో 40 మంది పాత్ర ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాం. కానీ పది కంపెనీలు, ఆరుగురు వ్యక్తుల పాత్రపై ప్రాథమిక అభియోగపత్రంలో వివరిస్తున్నాం. ఇతరుల పాత్రపై త్వరలో మరో చార్జిషీట్ దాఖలు చేస్తాం’ అని కోర్టుకు సిట్ తెలిపింది.