SIT Investigation: లిక్కర్ సొమ్ముతో దుబాయ్‌లో టెక్కర్
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:33 AM
పేరు... తుతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన ఐఐటీ పట్టభద్రుడు. దుబాయ్, లండన్, నెదర్లాండ్స్, యూఏఈలో పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
150 కోట్లకు పైగా తరలించిన ఏ9 కిరణ్ రెడ్డి
ఎన్నికల ముందే హవాలా మార్గంలో విదేశాలకు
2024లో వైసీపీ ఓడిపోయాక దుబాయ్‌కి జంప్
లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఆరుగురు అక్కడే
ట్రేడింగ్, ట్రక్, ట్రాన్స్‌పోర్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు
లండన్, నెదర్లాండ్స్, యూఏఈలోనూ ప్రారంభం
సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పేరు... తుతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన ఐఐటీ పట్టభద్రుడు. దుబాయ్, లండన్, నెదర్లాండ్స్, యూఏఈలో పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఐఐటియన్ కావడంతో బహుళ జాతి సంస్థల్లో పనిచేసి కోట్లాది రూపాయలు సంపాదించాడని అనుకుంటే తప్పులో కాలేసినట్టే! జగన్ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఆయన ఏ9 నిందితుడు. కిరణ్ తన ‘తెలివితేటల’ను సక్రమ మార్గంలో గాక, లిక్కర్ స్కామ్‌లో దోచుకోవడం, దాచుకోవడంలో చూపించాడు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో తన వాటాతో పాటు పెద్దలు దోచుకున్న సొమ్ములో కిరణ్ దాదాపు 150 కోట్ల రూపాయల వరకూ తరలించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. హవాలా మార్గంలో ప్రతి పది, పదిహేను రోజులకు ఒకసారి కనీసం రెండు కోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకూ విదేశాలకు పంపినట్టు గుర్తించింది. ఇలా పదుల సార్లు లిక్కర్ ముడుపులు అక్రమంగా తరలించినట్లు పసిగట్టింది. ఈ డబ్బుతో కిరణ్ అక్కడ రియల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్టు, ట్రక్, ట్రేడింగ్, ఫర్నీచర్ తదితర వ్యాపారాలు ప్రారంభించాడు.
ఇదీ నేరప్రస్థానం...
శ్రీకాళహస్తికి చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి చెన్నైలో ఐఐటీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా డికార్డ్ లాజిస్టిక్స్ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం జగన్ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెంతకు చేరాడు. లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ అయిన రాజ్ కసిరెడ్డి(ఏ-1) ముడుపుల సేకరణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తెలివైన యువకుల్ని నియమించుకున్నాడు. అప్పటికే డికార్డ్ లాజిస్టిక్స్ నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తన వద్దకు ఉద్యోగం కోసం వచ్చే యువకుల్లో మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి మద్యం ముడుపుల సేకరణకు అప్పగించాడు. పనిలో పనిగా తన వాటాతో పాటు మరికొంత నొక్కేశాడు. గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడాన్ని ముందే గ్రహించిన కిరణ్ తన ‘భవిష్యత్తు’ చూసుకున్నాడు. దుబాయ్‌లో సెటిల్ అయ్యేందుకు 2022 నుంచే ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా మద్యం కుంభకోణంలో తన వాటా, కాజేసిన సొమ్మును దేశం దాటించేశాడు. 2024లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో లిక్కర్ స్కామ్‌లో కొందరు సహ నిందితులతో పాటు మరికొందరిని తీసుకుని దుబాయ్ వెళ్లిపోయాడు. దుబాయ్‌లో ఎలాంటి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయో ముందే అంచనా వేసుకున్నాడు. ఇక్కడ లాజిస్టిక్స్ వ్యాపారంలో అనుభవం ఉండటంతో అక్కడ కూడా అదే చేద్దామనుకుని ఆరా తీశాడు. దుబాయ్‌లో లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ లాభసాటిగా ఉంటుందని తెలుసుకున్నాడు. ‘టెక్కర్’ పేరుతో ట్రాన్స్‌పోర్ట్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలు పెట్టాడు. దుబాయ్‌తో పాటు లండన్, నెదర్లాండ్స్, యూఏఈలోనూ వ్యాపారాలు ప్రారంభించాడు.
ట్రక్కర్.. టెక్కర్
దుబాయ్‌లో ట్రక్కర్ (ఖీఖ్ఖఓఓఉఖ) అనే లాజిస్టిక్స్ సంస్థ ఫేమస్. ఈ పేరుకు దగ్గరగా ఉండేలా కిరణ్ తన సంస్థకు టెక్కర్ (ఖీఉఓఓఅఖ) అనే పేరు పెట్టాడు. సిట్ అధికారులు ఆరా తీయగా... ఇది తుతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి(ఖీఉఓఓఅఖ) కంపెనీ అని తేలింది. కిరణ్ వ్యాపారాలతో పాటు అందులో కీలక వ్యక్తుల వివరాలు కూపీ లాగారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులు, అనుమానితులు ఆరుగురికి పైగా ఉన్నట్లు గుర్తించారు. కిరణ్ కుమార్ రెడ్దితో పాటు సైఫ్ అహ్మద్, అవినాశ్ రెడ్డి, వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్న దుబాయ్‌కి చేరినట్లు ఆధారాలు సేకరించారు. మరో పదిహేను మందికి పైగా దక్షిణాది రాష్ట్రాలకు(ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు) చెందిన యువకులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్నారు.
విదేశాల్లో కిరణ్ వ్యాపారాలు..
టెక్కర్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ- దుబాయ్
టెక్కర్ ట్రక్ సర్వీస్- యూఏఈ
టెక్కర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్- లండన్
టెక్కర్ రియల్ ఎస్టేట్స్- దుబాయ్
హోమ్ హ్యావ్స్ ఫర్నీచర్ ఫ్రాంచైజీ- నెదర్లాండ్స్