Share News

SIT Investigation: పీఎల్‌ఆర్‌ ఫండ్స్‌ బదిలీ సంగతేంటి

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:59 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) అత్యంత పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తోంది.

SIT Investigation: పీఎల్‌ఆర్‌ ఫండ్స్‌ బదిలీ సంగతేంటి

  • ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి,ఈడీ శివారెడ్డిని ప్రశ్నించిన సిట్‌

  • లిక్కర్‌ స్కామ్‌లో 5 కోట్ల లావాదేవీలపై ఆరా తమకేమీ తెలియదన్న డైరెక్టర్లు

  • మిథున్‌రెడ్డి పీఏ నుంచి కీలక వివరాలు రాబట్టిన దర్యాప్తు అధికారులు

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) అత్యంత పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తోంది. వందల మందిని విచారించి, అనుమానితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్‌ అధికారులు లిక్కర్‌ స్కాంకు సంబంధించిన ఆధారాలు లోతుగా సేకరిస్తున్నారు. ఎక్కడా పరిధి దాటకుండా టెక్నాలజీ సాయంతో.. అనుమానితులు, సాక్షులు ఇచ్చిన సమాచారంతో.. దర్యాప్తులో లభించిన ఆధారాలతో సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) శివారెడ్డిని బుధవారం వారు ప్రశ్నించారు. ఆదాన్‌ డిస్టిలరీస్‌ ఖాతా నుంచి డి కార్ట్‌ ద్వారా పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ఖాతాలోకి రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ విషయాన్ని మిథున్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ పేర్కొంది. ఇవి లిక్కర్‌ ముడుపులేననేందుకు ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు.. ఆ లావాదేవీల గురించి పీఎల్‌ఆర్‌ ఎండీ, ఈడీలను అడిగారు. ప్రాజెక్టుకు వచ్చే పోయే నిధులపై ఆరా తీశారు. అయితే ఈ వివరాలేవీ తమకు తెలియవని వారిద్దరూ స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు మిథున్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడిని కూడా సిట్‌ ప్రశ్నించి పలు కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మిథున్‌రెడ్డి(ఏ-4) అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - Aug 07 , 2025 | 04:01 AM