Share News

SIT: మద్యం కేసులో మరో అరెస్ట్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:44 AM

జగన్‌ హయాంలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ అధికారులు ముంబైకి చెందిన అనిల్‌ చోఖ్రాను అరెస్టు చేశారు.

 SIT: మద్యం కేసులో మరో అరెస్ట్‌

  • లిక్కర్‌ ముడుపులతో అనిల్‌ చోఖ్రా మనీలాండరింగ్‌

  • రాజ్‌ కసిరెడ్డికి చెందిన 77.55 కోట్లు వైట్‌ మనీగా మార్పు

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ అధికారులు ముంబైకి చెందిన అనిల్‌ చోఖ్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి చెందిన రూ.77.55 కోట్లను డొల్ల కంపెనీల ద్వారా తరలించిన ఆయన్ను ఈ నెల 13న అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు మనీలాండరింగ్‌ కేసుల్లో అరెస్టయి బెయిలుపై ఉన్న చోఖ్రా... డొల్ల కంపెనీలు సృష్టించి నల్ల డబ్బును తెల్లగా మారుస్తుంటాడు. బినామీల పేరుతో ముంబైలో క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్విక్‌ మల్టీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విశాల్‌ ఎంటర్‌పైజ్రెస్‌ అంటూ నాలుగు డొల్ల కంపెనీలు సృష్టించాడు. ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే రూ.వేల కోట్ల లావాదేవీలు నిర్వహించే ఆయన రాజ్‌ కసిరెడ్డి ద్వారా అందిన సొమ్మును తొలుత ఈ నాలుగు షెల్‌ కంపెనీల ఖాతాల్లోకి జమచేసి మరో 32 ఖాతాలకు లేయరింగ్‌ చేసినట్లు సిట్‌ గుర్తించింది. చోఖ్రా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ 2017లో, 2021లో రెండు వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపింది. బెయిలుపై బయటికి వచ్చిన ఆయన్ను వైసీపీ నేతలు సంప్రదించారు. లిక్కర్‌ సొమ్మును వైట్‌గా మార్చేందుకు సహకారం కోరారు. వారినుంచి దండిగా కమీషన్‌ ముట్టడంతో చోఖ్రా తన అనుచరుల పేరుతో ఉన్న డొల్ల కంపెనీల జాబితా ఇచ్చాడు. అందులో నాలుగు కంపెనీల ఖాతాలు వాడుకుని రూ.77.55కోట్ల లావాదేవీలు జరిపారు. కేసు దర్యాప్తులో భా గంగా కూపీలాగిన సిట్‌అధికారులు ఎవరెవరితో,ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపాడో.. మెత్తం టెక్నాలజీ సహకారంతో వెలికితీశారు. చోఖ్రాను 49వ నిందితుడిగా చేర్చారు. శనివారం ఆయనను విజయవాడ ఏసీబీకోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 04:45 AM