Share News

SIT Alleges: మోహిత్‌రెడ్డి అదేపనిగా వాయిదా కోరుతున్నారు

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:11 AM

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొందిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రాకుండా....

 SIT Alleges: మోహిత్‌రెడ్డి అదేపనిగా వాయిదా కోరుతున్నారు

  • మధ్యంతర ఉత్తర్వులను అడ్డుపెట్టుకున్నారు

  • విచారణ సాగదీస్తున్నారు: సిట్‌ వాదనలు

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొందిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రాకుండా అదేపనిగా వాయిదాలు కోరుతున్నారని సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టుకు నివేదించారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషన్‌పై విచారణ జరగకుండా సాగదీస్తున్నారని వివరించారు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో ఆయన వాదనలు వినిపిస్తూ.. చార్జిషీట్‌ దాఖలు చేసేవరకు విచారణ జరగకుండా చూడాలన్నదే మోహిత్‌రెడ్డి ఉద్దేశమని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని అభ్యర్థించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాలతో సీనియర్‌ న్యాయవాది విచారణకు హాజరుకాలేకపోయారని, మరోరోజుకు వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ముందస్తు బెయిల్‌పై తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. మోహిత్‌రెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. మద్యం కుంభకోణం కేసులో 39వ నిందితుడిగా(ఏ-39) ఉన్న తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 13 , 2025 | 06:12 AM