Liquor Scam: మద్యం స్కాంలో మిథున్‌రెడ్డిదే కీలక పాత్ర
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:29 AM
వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టుకు తెలిపారు.
ముడుపులు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లిచ్చారు
షెల్ కంపెనీల ద్వారా సొమ్ము మళ్లించారు
పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు చేరిన రూ.5 కోట్లు
ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాలి
పిటిషనర్‌కు పూర్వ నేరచరిత్ర కూడా ఉంది
హైకోర్టులో సీనియర్ న్యాయవాది లూథ్రా వాదన
డీకార్ట్ లాజిస్టిక్స్ సొమ్మును తిరిగి ఇచ్చారు
సొమ్ము మిథున్‌రెడ్డికి చేరినట్లు ఆధారాలు లేవు
ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు
పాలసీ రూపకల్పన, అమలులో ప్రధాన భూమిక
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టుకు తెలిపారు. అప్పట్లో లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో మిథున్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించారని చెప్పారు. ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇచ్చారని పేర్కొన్నారు. అక్రమంగా ఆర్జించిన సొమ్మును వివిధ మార్గాలు, నకిలీ కంపెనీల ద్వారా మళ్లించారన్నారు. ఈ మేరకు హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల మేరకు నష్టం చేశారు. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన రూ.5 కోట్ల సొమ్మును డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు చేరాయి. పీఎల్‌ఆర్ సంస్థలో వందశాతం షేర్లు మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులవే. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్న మిథున్‌రెడ్డి వాదనలో అర్థం లేదు. ముడుపుల వసూళ్ల గురించి పత్రికల్లో వార్తలు రావడంతో డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి వచ్చిన సొమ్మును తిరిగి ఆ సంస్థకే చెల్లించారు. అయితే, ఆ సొమ్మును నగదు రూపేణా వివిధ మార్గాల్లో తిరిగి పిటిషనర్ ఖాతాలకే చేరింది. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాలోకి చేరిందనే విషయాన్ని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. వాస్తవాలు రాబట్టాలంటే పిటిషనర్ కస్టోడియల్ విచారణ అవసరం. పిటిషనర్‌కు పూర్వ నేరచరిత్ర ఉంది.
తనపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచలేదు. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొందరు నిందితులు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉంది. పిటిషనర్ మొదటిసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేనాటికే మద్యం కుంభకోణంలో ఆయన పాత్రపై ఆధారాలు ఉన్నాయి. కుంభకోణంలో పిటిషనర్ పాత్రపై పలువురు నిందితులు, సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. ఆధారాలు లభించిన తర్వాత నిందితుడిగా చేరుస్తూ సంబంధిత కోర్టులో ఏప్రిల్ 22న మెమో దాఖలు చేశాం.’’ అని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. పూర్తిస్థాయి వాదనల కోసం తగినంత సమయం లేకపోవడంతో కొనసాగింపు కోసం విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ అధికారిని విచారించాలి: నిరంజన్‌రెడ్డి
మద్యం కుంభకోణం వ్యవహారంపై గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ముందస్తు బెయిల్ కోసం గతంలో మిథున్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా దర్యాప్తు అధికారి పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచకుండా తప్పుదోవపట్టించారు. దర్యాప్తు అధికారిని ప్రాసిక్యూట్ చేయాలి. గత బెయిల్ పిటిషన్ విచారణ నాటికే 104 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌తో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు. డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు వచ్చిన రూ.5 కోట్ల సొమ్మును తిరిగి ఆ సంస్థకు చెల్లించారు. ఈ లావాదేవాలపై పిటిషనర్ ఇప్పటికే సిట్‌కు వివరణ ఇచ్చారు. ముడుపుల సొమ్ము పిటిషనర్‌కు చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మద్యం పాలసీ రూపకల్పనలో పిటిషనర్‌కు ఎలాంటి పాత్ర లేదు. అరెస్ట్ చేసి వేధించేందుకు పోలీసులు పిటిషనర్‌ను వెంటాడుతున్నారు. కేసులో ఏ2గా ఉన్న డి. వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్, ఏ5 మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జోలికి పోలీసులు వెళ్లడం లేదు.’’ అని కోర్టుకు వివరించారు.