SIT Investigation: లిక్కర్ స్కామ్‌లో కటక్ కి లేడీ
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:19 AM
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలను తన్నేవాడుంటాడు.. అన్నది పాత సామెత. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.
మద్యం ముడుపుల సొమ్ము దొంగలపాలు
జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లో మరో ట్విస్టు
రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము చోరీ
హైదరాబాద్‌లో దాచిన 6 నోట్ల కట్టల బాక్సులు మాయం
పకడ్బందీగా రెక్కీ.. హైదరాబాదీలతో కలిసి ప్లాన్
ప్రియుడితో కలిసి కాజేసిన ఒడిశా మహిళ
4 పెట్టెలతో రషిత, ఇర్షాద్ గ్యాంగ్ కటక్‌కు పరార్
ముందే 2 బాక్సులు కాజేసిన ఇర్షాద్ మిత్రుడు
వసూలుకు ప్రయత్నించి విఫలమైన రాజ్ గ్యాంగ్
సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి
త్వరలో రూ.5.10 కోట్ల విలువైన ఆస్తుల జప్తు
లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీలో... మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేసి దాచింది హైదరాబాద్‌లో... లిక్కర్ మాఫియా దాచిన నోట్ల కట్టల బాక్సుల్లో నాలుగు ఒడిశాలోని కటక్ చేరాయి. ఓ కటక్ కి‘లేడీ’ తన ప్రియుడితో కలసి ఆరు బాక్సులు కొట్టేసింది. కానీ వీటిలో రెండింటిని హైదరాబాద్‌లో తన ప్రియుడి మిత్రుడు కాజేశాడు. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ఓ వెరైటీ దోపిడీ ఇదీ!
మద్యం ముడుపులు వసూలు చేసిన రాజ్ కసిరెడ్డి గ్యాంగ్‌లో సైమన్ ప్రసన్ కీలక వ్యక్తి.. అతడి బామ్మర్ది మోహన్.. మోహన్ బామ్మర్ది అనిల్.. అతడి సన్నిహితురాలు రషిత (కటక్).. ఆమె మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్ (కటక్).. మోహన్ ఇంట్లో దాచిన నోట్ల కట్టలను రషిత, ఇర్షాద్ కలసి కొట్టేశారు. సినీ ఫక్కీలో ఎన్నో పాత్రలు తెరపైకి వస్తూ, ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ దోపిడీ కథ సాగింది.
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తాడిని తన్నేవాడుంటే.. వాడి తలను తన్నేవాడుంటాడు.. అన్నది పాత సామెత. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది. గత ప్రభుత్వంలో చౌక మద్యాన్ని జనం నోట్లో పోసి దోచుకున్న సొమ్ములో కొంత దొంగలపాలైంది. దోపిడీదారుల్నే దోచేసిన కి‘లేడీ’ వ్యవహారం తాజాగా బట్టబయలైంది. లిక్కర్ ముఠా ముడుపులు వసూలు చేసి హైదరాబాద్‌లో దాచిన నోట్ల కట్టల బాక్సులు ఏపీ మీదుగానే ఒడిశాలోని కటక్ చేరాయి. మద్యం దోపిడీలో చిన్న పాత్ర పోషించిన ఒక వ్యక్తికి సన్నిహితంగా ఉన్న ఓ మహిళ సినీ ఫక్కీలో డబ్బు కొట్టేసి కటక్‌లో మేడలు కట్టేసింది. నయా దోపిడీలో మరో ట్విస్టు ఏంటంటే... కటక్ మహిళ తన ప్రియుడి గ్యాంగ్‌తో కలసి 6 నోట్ల కట్టల బాక్సులను కొట్టేయగా, వాటిలో రెండింటిని హైదరాబాద్‌లో ఉంటున్న మరో ఒడిశా వ్యక్తి కాజేశాడు. కటక్‌లో 4 కోట్లకు పైగా, హైదరాబాద్‌లో కోటి రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది.
బాక్సులు.. నోట్లు
జగన్ పాలనలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలుకు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్‌లో సైమన్ ప్రసన్ కీలక వ్యక్తి. విశాఖకు చెందిన బామ్మర్ది మోహన్‌ను హైదరాబాద్ రప్పించుకుని.. ఫిల్మ్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఉంచాడు. వసూలు చేసిన ముడుపుల సొమ్మును అక్కడికి చేర్చేవారు. దానిని భద్రపరిచేందుకు ప్రత్యేక సైజులో ఉండే అట్టపెట్టెలు ఆర్డర్ ఇచ్చారు. వాటిలో రూ.100, రూ.200, రూ.500 నోట్ల కట్టలను వేర్వేరుగా దాచేవారు. ఒక్కో బాక్సులో 100 నోట్లు అయితే రూ.24 లక్షలు.. 200 అయితే రూ.48 లక్షలు.. 500 అయితే రూ.1.20 కోట్లు చొప్పున సరిగ్గా సరిపోయేలా పేర్చేవారు. ఆ బాక్సులకు టేప్ వేసి పైన సింబాలిక్‌గా 100, 200, 500 అని రాసేవారు. వసూలు చేసిన మొత్తం పది కోట్లు కాగానే రాజ్ కసిరెడ్డికి సమాచారం ఇచ్చేవారు. ఎవరో ఒకరు కార్లలో వచ్చి ఈ బాక్సులను తీసుకెళ్లేవారు.
అతడు.. ఆమె.. ఇతడు
బాక్సులు.. నోట్లు.. సర్దుడు వ్యవహారం జరుగుతున్న క్రమంలో మోహన్ బామ్మర్ది అనిల్ కాలు విరగడంతో హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవాడికి వచ్చాడు. మోహన్ ఇంట్లో ఉన్నాడు. అనిల్‌కు కటక్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహించే రషిత బ్యూరో అనే యువతితో సన్నిహిత సంబంధం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న తన ప్రియుడు అనిల్‌ను చూడటానికి కటక్ నుంచి ఆమె ఓ రోజు వచ్చింది. అదే సమయంలో అనిల్‌తో పాటు మోహన్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. బెడ్‌రూమ్‌లో దాచిన అట్టపెట్టెల బాక్సులను ఆమె చూసింది. వాటి గురించి ఆరా తీయగా వారు విషయం చెప్పకుండా దాటవేశారు. ఆమెకు అనుమానం వచ్చి అర్ధరాత్రి ఒక బాక్సు తీసి చూసింది. పెద్దఎత్తున నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయింది. కటక్‌లో ఉంటున్న తన మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ముడుపుల సొమ్ము కోట్ల లో ఉందని, నాలుగు బాక్సులు పట్టుకెళ్తే మన లైఫ్ సెటిల్ అవుతుందని ఆశ చూపింది. దీంతో మరో ఇద్దర్ని తీసుకుని 2023 జనవరి 10న ఇర్షాద్ హైదరాబాద్ వచ్చాడు.
భోగి రోజు చోరీ
ఇర్షాద్ హైదరాబాద్ వచ్చిన వెంటనే కటక్ నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి ఫిల్మ్‌నగర్‌లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న పాత మిత్రుడు ముబారక్ అలీని సంప్రదించాడు. తనకు ముగ్గురు చురుకైన యువకులు, 3 ద్విచక్ర వాహనాలు కావాలని చెప్పాడు. మూడు బైకుల్లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో పాటు కటక్ నుంచి తన వెంట వచ్చిన ఇద్దరిని తీసుకుని మొత్తం ఆరుగురు(ఇర్షాద్ సహా) 2023 జనవరి 13న వేకువజామున 3 గంటల ప్రాంతంలో మోహన్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇర్షాద్ రషితకు ఫోన్ చేశాడు. తలుపు గడియ తీసే ఉంచానని, అందరూ నిద్రలో ఉన్నారని, కాసేపైతే భోగి మంటల కోసం లేస్తారని, వెంటనే వచ్చేయాలని ఆమె చెప్పింది. నలుగురు గుట్టు చప్పుడు కాకుండా మోహన్ ఇంట్లోకి వెళ్లి 4 నోట్ల కట్టల బాక్సుల్ని తీసుకుని బయటికి వచ్చారు. కాసేపటికి రషిత మళ్లీ ఫోన్ చేసి వచ్చి మరో రెండు పట్లుకెళ్లమని చెప్పింది. ఆరు బాక్సులూ తీసుకెళ్లి ముబారక్ ఇంట్లో మంచం కింద దాచారు. బాక్సులు మాయమైన విషయం ఒక రోజు తర్వాత మోహన్‌కు తెలిసింది. వెంటనే సైమన్‌కు చెప్పాడు. సైమన్ మరో వ్యక్తి రాజీవ్ ప్రతా్‌పతో కలిసి హడావుడిగా అక్కడికి వచ్చాడు. బాక్సుల గురించి ఎంత ఆరా తీసినా కనిపెట్టలేకపోయారు. సైమన్ తనకు తెలిసిన పోలీసు అధికారి సాయం కోరాడు. పోలీసు అధికారి మోహన్ ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీ పరిశీలించారు. 2023 జనవరి 13 వేకువజామున అక్కడికి మూడు ద్విచక్ర వాహనాల్లో ఆరుగురు యువకులు వచ్చినట్లు గుర్తించారు. ఆ లొకేషన్లో ఉన్న సెల్ నంబర్లను ఒడిశాకు చెందినవిగా తెలుసుకున్నారు. అనుమానం రావడంతో మోహన్ ఇంట్లో ఉంటున్న అతడి బామ్మర్తి అనిల్ ప్రియురాలు రషిత (ఒడిశా) నంబర్ తీసుకుని కాల్ డేటా పరిశీలించారు. ఆరుగురు యువకులు వచ్చిన సమయంలోనే రషిత, ఇర్షాద్ ఫోన్లు చేసుకోవడం తెలుసుకున్నారు. రషిత ద్వారానే దొంగతనం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. అప్పటికే రషిత ఇర్షాద్‌తో కలసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒడిశా వెళ్లిపోయింది.
కటక్ వెళ్లినా...
బాక్సుల చోరీ విషయం కసిరెడ్డికి తెలిస్తే చంపేస్తాడనే భయంతో సైమన్, మోహన్, అనిల్ అందరూ కలిసి ఎక్కడెక్కడి నుంచో కొంత డబ్బులు సేకరించారు. ఇంట్లో మహిళలందరి బంగారం అమ్మేసి 40 లక్షల వరకూ సేకరించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న ముబారక్ అలీ పాత్ర వెలుగులోకి వచ్చింది. అక్కడికి వెళ్లి విచారించగా తనకు ఏమీ తెలియదని, ఇర్షాద్ ఫోన్ చేసి ముగ్గురు యువకులు, మూడు బైకులు కావాలంటే ఏర్పాటు చేశానని చెప్పాడు. ఆ యువకుల్ని పిలిచి విచారించడంతో అట్ట పెట్టెలు తీసుకొచ్చామని, అందులో డబ్బులు ఉన్నట్లు తమకు తెలియదని, ముబారక్ ఇంట్లో పెట్టేసి వెళ్లిపోయామని చెప్పారు. తన ఇంట్లో దాచిన అట్ట పెట్టెల్ని ఇర్షాద్, అతనితో వచ్చిన యువకులు కటక్ వెళ్లే రైలులో తీసుకెళ్లారని ముబారక్ చెప్పాడు. వెంటనే సైమన్, మోహన్, అనిల్ కటక్ వెళ్లి డబ్బుల కోసం రషితను బెదిరించారు. ఆమె ఇర్షాద్‌కు ఫోన్ చేయగానే పెద్ద గ్యాంగ్ వాలిపోయింది. ప్రాణభయంతో సైమన్, మోహన్, అనిల్ వారిని బతిమాలి వెనక్కి వచ్చేశారు. తర్వాత తెలంగాణ ఎన్నికలు రావడం, నోట్ల కట్టల బాక్సులను హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తరలించడం, ఏపీలోనూ ఎన్నికలు రావడంతో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీలో కసిరెడ్డి నిమగ్నమయ్యాడు. దోపిడీ వ్యవహారం బయటకు రాకుండా సైమన్ గ్యాంగ్ మేనేజ్ చేసింది.
జప్తునకు రంగం సిద్ధం
ఇటీవల సిట్ ముందు విచారణకు వచ్చిన సైమన్ ఒడిశా కిలేడీ దోచుకున్న వైనాన్ని వివరించాడు. కటక్ వెళ్లిన సిట్ అధికారులు అక్కడ ఇర్షాద్ అహ్మద్, రషిత నివాస స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నట్టు గుర్తించారు. అక్కడి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. ఇక్కడ మరో ట్విస్టు బయటపడింది. తాము 4 బాక్సులే తెచ్చామని, మరో రెండు ముబారక్ అలీ కాజేశాడని, అడిగితే బెదిరించాడని విచారణలో ఇర్షాద్, రషిత చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లి ముబారక్ అలీని ప్రశ్నించగా.. అది దొంగ డబ్బే కదా అని తాను రెండు బాక్సులు పక్కన పెట్టి రూ.80 లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేశానని, మిగతా సొమ్ము వ్యాపారంలో పెట్టానని అంగీకరించాడు. ఇర్షాద్, రషిత వద్ద ఉన్న 4 కోట్లకు పైగా ఆస్తులు, ముబారక్ అలీ వద్ద ఉన్న కోటికి పైగా ఆస్తులు అన్నీ కలిపి రూ.5.10 కోట్లు జప్తు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ వారంలో ప్రక్రియ పూర్తి చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.