SIT Raids: సీసాలో భూతం
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:44 AM
మద్యం సీసా’లోంచి అనేక అక్రమాల భూతాలు బయటపడుతున్నాయి. సొమ్ములు పోగేసుకోవడం, ఎన్నికల్లో ఓట్లు కొనడమే ప్రధాన లక్ష్యంగా జగన్ హయాంలో మద్యం విధానం రూపుదిద్దుకుంది. అయితే... ముడుపుల వసూళ్లు, రవాణాలో కీలక పాత్ర పోషించిన...
మద్యం సొమ్ముతో చెవిరెడ్డి భూముల దందా
6 కోట్లతో గూడూరులో 260 ఎకరాలు కొనుగోలు
ఆ వెంటనే అరబిందోకు రూ.26 కోట్లకు విక్రయం
ఆ డబ్బుతో తిరుపతి చుట్టూ భారీగా భూ కొనుగోళ్లు
‘తుడా’ నిధులతో రోడ్లు, మౌలిక వసతులు.. లేఔట్లు
ప్లాట్ల విక్రయంతో వందల కోట్ల సొమ్ము
‘సిట్’ సోదాల్లో సంచలనాలు వెలుగులోకి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘మద్యం సీసా’లోంచి అనేక అక్రమాల భూతాలు బయటపడుతున్నాయి. సొమ్ములు పోగేసుకోవడం, ఎన్నికల్లో ఓట్లు కొనడమే ప్రధాన లక్ష్యంగా జగన్ హయాంలో మద్యం విధానం రూపుదిద్దుకుంది. అయితే... ముడుపుల వసూళ్లు, రవాణాలో కీలక పాత్ర పోషించిన వారు కొంత సొమ్ము మళ్లించేసి మాయ చేశారు. అందులో... మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన భూదందా బయటపడింది. తాజాగా ‘సిట్’ జరిపిన సోదాల్లో తేలిన సరికొత్త సంగతి ఇది! విశ్వసనీయ సమాచారం ప్రకారం...జగన్‌కు సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ‘సిట్’ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. మోహిత్ రెడ్డి ఏకంగా రూ.600 కోట్ల విలువైన భూ లావాదేవీలు జరిపినట్లు ప్రాథమిక ఆధారాలు గుర్తించింది. ఇది... ‘అధికారికంగా’ రూ.6 కోట్లతో మొదలైనట్లు తెలుస్తోంది. కల్యాణ వెంకటేశ్వర స్వామి (కేవీఎస్) ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గూడూరు చుట్టుపక్కల ఏకంగా 260 ఎకరాలు కొనుగోలు చేశారు. రికార్డుల్లో ఎకరం రూ.2.10 లక్షలకు కొన్నట్టు చూపించారు. ఇది రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే! బహిరంగ మార్కెట్ విలువ అంతకు అనేక రెట్లు ఉంటుంది. 2022 అక్టోబరులో ఈ డీల్ జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకే... డిసెంబరులో ఇవే భూములను రూ.26 కోట్లకు, అంటే ఎకరం రూ.10 లక్షలకు అరబిందోకు విక్రయించారు. ఇది కూడా రిజిస్ట్రేషన్ ధరే! భారీగా ల్యాండ్‌బ్యాంక్‌ను సమకూర్చుకుంటున్న అరబిందో సంస్థ ఈ భూములను సొంతం చేసుకుంది. కేవీఎస్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రికార్డుల్లో ఈ లావాదేవీల వివరాలు నమోదయ్యాయి.
‘తుడా’ పదవితో చక్రం...
బ్లాక్‌ను ‘వైట్’ చేసుకోగా వచ్చిన డబ్బులతో మోహిత్ రెడ్డికి చెందిన కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా తిరుపతి చుట్టు పక్కల భారీగా భూముల కొనుగోలుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. వందలకోట్ల రూపాయల విలువైన భూములు సొంతం చేసుకున్నారు. అప్పట్లో ‘తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ’ (తుడా) చైర్మన్‌గా ఉన్న మోహిత్ రెడ్డి... సంస్థ నిధులతో తన భూముల్లో రోడ్లు వేయించుకున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి... వాటి ధరలు భారీగా పెరిగేలా చూసుకున్నారు. కేవీఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్, సీఎంఆర్ అగ్రిక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మునిరెడ్డి గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గెరైన్ ప్రైవేట్ లిమిటెడ్... ఇలా మొత్తం ఎనిమిది కంపెనీలతో చెవిరెడ్డి కుటుంబం లావాదేవీలు నడిపింది. ఎన్నికల తర్వాత వాటిలో కొన్నింటిని మూసేశారు. వాటి రికార్డుల పరిశీలనలో భారీగా అక్రమ లావాదేవీలు బయట పడుతున్నట్లు సమాచారం.అలాగే, చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజయానంద రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి తదితరుల బినామీ కంపెనీల ద్వారా 200కోట్ల వరకూ వ్యవహారాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చిన సిట్... వాటికి సంబంధించిన ఆధారాలను ఒక్కొక్కటిగా సేకరిస్తోంది.