Share News

ACB Court: లిక్కర్‌ గ్యాంగ్‌కు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:45 AM

మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు ఈ నెల 19 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ACB Court: లిక్కర్‌ గ్యాంగ్‌కు రిమాండ్‌ పొడిగింపు

  • ఈ నెల 19 వరకు పెంచిన ఏసీబీ కోర్టు

  • చెవిరెడ్డి సహా పలువురు నిందితుల బెయిల్‌ పిటిషన్లు కొట్టేసిన న్యాయస్థానం

  • ఇంటి భోజనానికి అనుమతి కోరిన రోణక్‌

విజయవాడ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు ఈ నెల 19 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడ జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య, చెరుకూరి వెంకటేశ్‌నాయుడు, అనిల్‌ చోక్రా, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్‌కృష్ణ, బాలాజీ కుమార్‌ యాదవ్‌, జెస్సీ ఫాల్గట్‌ కుమార్‌ అలియాస్‌ రోణక్‌ కుమార్‌ రిమాండ్‌ గడువు ముగియడంతో శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి ఈ నెల 19 వరకు రిమాండ్‌ పొడిగిస్టున్నట్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. బెయిల్‌పై బయట ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కె. ధనంజయ్‌రెడ్డి, పి. కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ కుమార్‌లు కూడా వాయిదాకు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హాజరుకాలేదు. మరో నిందితుడు పైలా దిలీప్‌ వాయిదాకు హాజరుకాలేనని పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదిలావుంటే.. ధనంజయ్‌రెడ్డి సిట్‌ అధికారులపై న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. తాము వాయిదాలకు వచ్చినప్పుడు విమానాశ్రయంలో కొందరిని యాదృచ్ఛికంగా కలుస్తున్నామన్నారు. ఈ సందర్భాల్లో సిట్‌ అధికారులు ఫొటోలు, వీడియోలు తీసి నిందితులంతా కలుస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు.


కాగా, మద్యం కుంభకోణం కేసులో నిందితుడు రోణక్‌ కుమార్‌కు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని ఆయన తరపున న్యాయవాది లక్ష్మీనారాయణ పిటిషన్‌ దాఖలు చేశారు. జైన మతానికి సంబంధించిన రోణక్‌... వారి సంప్రదాయం ప్రకారం మాంసాహారం వండిన, ఉల్లిపాయలు వేయించిన పాత్రల్లో చేసిన ఆహారం తీసుకోరని తెలిపారు. కాబట్టి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. రోణక్‌ కుమార్‌కు విజయవాడలో ఇల్లు లేదు కదా? అని న్యాయాధికారి ప్రశ్నించగా.. ఆయన భార్యకు ఇక్కడ బంధువులు ఉన్నారని, వాళ్ల ఇంటి నుంచి భోజనాన్ని తీసుకెళ్తారని తెలిపారు. దీనికి సంబంధించిన కాపీని ప్రాసిక్యూషన్స్‌ జేడీ రాజేంద్రప్రసాద్‌ అందుబాటులో లేకపోవడంతో సిట్‌ దర్యాప్తు అధికారి శ్రీహరిబాబుకు అందజేయాలని న్యాయాధికారి సూచించారు.


బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహా చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, నవీన్‌ కృష్ణ, బాలాజీ కుమార్‌లు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను న్యాయాధికారి పి. భాస్కరరావు కొట్టివేశారు. ప్రస్తుత పరిస్థితిలో బెయిల్‌ ఇవ్వడం సాధ్యంకాదని తెలిపారు. కాగా, న్యాయస్థానంలో మద్యం కేసులో నిందితులంతా ఒక రూటులో వెళ్తుంటే, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాత్రం తాను సెపరేటు అంటున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కోర్టు ఇచ్చిన సమయం ఆయనకు సరిపోవడం లేదని చెబుతున్నారు. న్యాయాధికారి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌ పొడిగింపు తేదీని వెల్లడిస్తారు. నిందితుల తరపున న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి, భోజనాలు చేయడానికి న్యాయాధికారి ఒక గంట సమయం ఇస్తారు. అయితే చెవిరెడ్డి ముందుగా భార్య, కుమారులతో, ఆ తర్వాత న్యాయవాదులతో భేటీ అవుతున్నారు. తర్వాత నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. ప్రతి రిమాండ్‌ పొడిగింపులోనూ ఇదే జరుగుతోంది. నిందితులంతా ఎస్కార్ట్‌ వాహనాలు ఎక్కినప్పటికీ భాస్కర్‌రెడ్డి మాత్రం ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. ఎస్కార్ట్‌ సిబ్బంది, సిట్‌ సిబ్బంది సమయం అయిపోయిందని చెప్పినా ఖాతరు చేయకపోగా... ‘కాసేపు ఉండండి’ అంటున్నారని సిట్‌, ఎస్కార్ట్‌ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ మద్యం కేసులో.. ఇద్దరిపై పీటీ వారెంట్‌

విజయవాడ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో మదనపల్లె జిల్లా జైలులో ఉన్న జినేశ్‌, శిబులను కోర్టులో హాజరుపరచడానికి అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్‌ అధికారులు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కేరళలోని త్రిశూర్‌కు చెందిన జినేశ్‌, శిబులు గోవా నుంచి రిక్టిఫైడ్‌ స్పిరిట్‌, ఇతర రసాయనాలను బాలాజీకి సమకూర్చారు. వారిని ములకలచెరువు ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే, విజయవాడలోని భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో జినేశ్‌ను ఏ24, శిబును ఏ25గా చేర్చారు. వారిని ఇక్కడి కోర్టులో హాజరుపరిచేందుకు అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్‌ అధికారులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

Updated Date - Dec 06 , 2025 | 04:47 AM