Money Laundering: మద్యం ముడుపులతో ముంబైలో బంగారం
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:28 AM
జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ముడుపుల సొమ్మును రకరకాల మార్గాల్లో దారి మళ్లించారు.
‘వైట్’గా మార్చుకున్న కసిరెడ్డి గ్యాంగ్
సహకరించిన ఏ-49 అనిల్ చోఖ్రా
ఆదాన్, లీలా, ఎస్‌పీవై నుంచి 78 కోట్లు షెల్ ఖాతాల్లోకి మళ్లింపు
చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్
బులియన్ ట్రేడింగ్‌తో నగదు మార్పు
స్కామ్‌లో దుబాయ్ ఆర్థిక లింకులు
సిట్ విచారణలో గుట్టువిప్పిన చోఖ్రా
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ముడుపుల సొమ్మును రకరకాల మార్గాల్లో దారి మళ్లించారు. అందులో కొంత మొత్తాన్ని ముంబైలో బంగారం, నగదు రూపంలో ‘వైట్’గా మార్చుకున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఏ-49 నిందితుడు అనిల్ చోఖ్రా సిట్ విచారణలో ఆ గుట్టు విప్పాడు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(ఏ-1) బినామీ డిస్టిలరీలైన ఆదాన్, లీలా, ఎస్‌పీవై ఆగ్రోస్‌కు ఏపీఎస్‌బీసీఎల్ నుంచి వచ్చిన రూ.78 కోట్లను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. మనీలాండరింగ్ ద్వారా ఈ సొమ్మును కొంత బంగారం, మరికొంత నగదు రూపంలో వైట్‌గా మార్చుకున్నారు. ఆ వివరాలు మొత్తం సిట్ విచారణలో చోఖ్రా వెల్లడించాడు. షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడిన చోఖ్రా తనకు ఎవరెవరితో లావాదేవీలు జరిగాయో వెల్లడించాడు. ఊరూపేరూ లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి, ముంబైలో ముప్పైకి పైగా షెల్ కంపెనీలు సృష్టించి, వాటి బ్యాంకు ఖాతాల్లోకి రూ.కోట్లు జమ చేయించుకున్న వైనాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. చోఖ్రా చేతిలో ఉన్న ఓల్విక్, క్రిపటి, నైస్‌నా, విశాల్ తదితర కంపెనీల ఖాతాల్లోకి చేరిన సొమ్ముతో ముంబైలోని చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ కుదుర్చుకున్నాడు. మరికొంత డబ్బును సిండికేట్ గోల్డ్ డీలర్స్ ద్వారా బంగారంగా మార్చేశాడు. అంతిమంగా దుబాయ్‌లోని చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక లింకులతో మొత్తం నల్లడబ్బును వాషింగ్ మిషన్‌లో వేసిన దుస్తుల్లా వైట్‌గా మార్చేసినట్లు సిట్ అధికారులకు చోఖ్రా వివరించినట్లు తెలిసింది.
మరో రెండు రోజుల పాటు చోఖ్రాను సిట్ విచారించనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సుమారు 3,500 కోట్ల మద్యం స్కామ్‌లో కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న మాజీ సీఎం జగన్ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి(ఏ1)తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 13 మందిని సిట్ అరెస్టు చేసింది. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు కోట్లాది రూపాయల సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిరాస్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో జప్తు చేసింది. మరోవైపు డెన్‌ల నుంచి దొంగలు ఎత్తుకెళ్లిన కోట్ల రూపాయల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను ఒడిశా, హైదరాబాద్‌లలో గుర్తించి జప్తునకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇదే క్రమంలో ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను ఇటీవల అరెస్టు చేసింది. చోఖ్రా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది.